
NACIN in Palem : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని పాలసముద్రంలో పర్యటించి నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు మరియు నార్కోటిక్స్ (NACIN) ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించనున్నారు. మోదీ మంగళవారం మధ్యాహ్నం పాలసముద్రం చేరుకొని నిర్ణీత కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం తిరుగుపయనం అవుతారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పత్రికా ప్రకటనను రిలీజ్ చేసింది.
ప్రారంభోత్సవం అనంతరం, ప్రధానమంత్రి NACINలోని మొదటి అంతస్తు సందర్శించి పురాతన వస్తువుల స్మగ్లింగ్ కేంద్రం, మాదక ద్రవ్యాల అధ్యయన కేంద్రం, వన్యప్రాణుల క్రైమ్ డిటెక్షన్ సెంటర్‌లను పరీక్షిస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది.
తరువాత, మోడీ గ్రౌండ్ ఫ్లోర్‌ను సందర్శించి ఎక్స్-రే, బ్యాగేజీ స్క్రీనింగ్ సెంటర్‌ను పరిశీలిస్తారు. ఆ తర్వాత అకడమిక్ బ్లాక్‌ను సందర్శించి కొన్ని మొక్కలు నాటుతారు. నిర్మాణ కార్మికులతో సంభాషిస్తారు. కొంత మంది ట్రైనీ అధికారులతో ఇంటరాక్ట్ అవుతారు. ‘ఫ్లోరా ఆఫ్ పాలసముద్రం’ అనే పుస్తకాన్ని కూడా విడుదల చేస్తారని తెలిపారు. ప్రధానమంత్రి NACINకి అక్రిడిటేషన్ సర్టిఫికేట్‌ను అందజేస్తారు.
ఢిల్లీకి వెళ్లే ముందు మోదీ లేపాక్షి ఆలయాన్ని కూడా సందర్శించే అవకాశం ఉంది. ప్రధాని పర్యటన విజయవంతమయ్యేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. ఆయన దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలించారు. మోడీ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా హాజరుకానున్నారు.