Tummalapally Kalakshetram : మహా కవయిత్రి ఆతుకూరు మొల్లమాంబ (మొల్ల) తొలి తెలుగు కవయిత్రి అని రాష్ట్ర ఎక్సైజ్, గనులు, భూగర్భ శాస్త్ర శాఖామంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అంగి కవయిత్రి కాంస్య విగ్రహాన్ని తుమ్మలపల్లివారరి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో మొల్ల కాంస్య విగ్రహాన్ని మైసూరు మహారాజా, ఎంపీ యదువీర కృష్ణదత్త చామరాజ వడియార్ శనివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తుమలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. 2017లోనే కేంద్ర ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ ఆవిష్కరించి మొల్లమాంబను గౌరవించిందని గుర్తు చేశారు. విజయవాడలో మొల్ల కాంస్య విగ్రహ ఏర్పాటు కోసం ఏపీ కుమ్మరి శాలివాహన సంఘం అధ్యక్షుడు ఐలాపురం వెంకయ్య ఎంతో కృషి చేశారన్నారు.
మహిళలు చదువుకోవడానికి అవకాశం లేని రోజుల్లో రామాయణాన్ని సరళమైన భాషలో రచించిన కవయిత్రి మొల్ల అని వక్తలు కొనియాడారు. ఆరు ఖండాలు, 871 పద్యాలతో కూడిన రామాయణాన్ని కేవలం ఐదు రోజుల్లో రచించడం ఆమె విజ్ఞానానికి నిదర్శనమన్నారు. రామాయణం అందరికీ ఆదర్శం, ఆచరణీయమని వక్తలు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, కె.ఎస్.లక్ష్మణరావు, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావ్, కమ్మరి శాలివాహన సంఘ ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు మంత్రి కొల్లు రవీంద్ర, అతిథులను ఘనంగా సత్కరించారు.