
Prasanth Kishore : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో సర్వేలన్ని కాంగ్రెస్ కు అనుకూలంగా రావడంతో బీఆర్ఎస్ లో భయం పట్టుకుంది. సీఎం కేసీఆర్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను పిలిపించి ఎన్నికల విషయమై చర్చించినట్లు సమాచారం. దీంతో పీకే సూచనలు ఇప్పుడు బీఆర్ఎస్ ను రక్షిస్తాయా? అనేది సందేహమే.
కర్ణాటకలో లభించిన విజయంతో కాంగ్రెస్ కదనరంగంలో దూకింది. ఈ మేరకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని విజయం సాధించాలని భావిస్తోంది. ఈ మేరకు అన్ని అస్త్ర శస్త్రాలు వినియోగిస్తోంది. ఆరు అంశాలతో ప్రజలకు దగ్గరవ్వాలని చూస్తోంది. కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపుతూ కదన రంగంలో కత్తులు దూస్తోంది.
ప్రభుత్వంపై వ్యతిరేకతను క్యాష్ చేసుకుంటోంది. దీన్ని బీఆర్ఎస్ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. పదేళ్లు అవకాశమిచ్చారు. మాకు కూడా ఓసారి అవకాశం ఇవ్వాలని అర్థిస్తున్నారు. బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ వస్తే రైతులకు కన్నీరే. ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉండదని భయపెడుతోంది. అధికార మార్పిడి తథ్యమనే వాదనలు మాత్రం బలంగా వస్తున్నాయి.
ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అన్ని దారులు అన్వేషిస్తోంది. కేసీఆర్ పాలనకు అంతం పలకాలని కోరుతోంది. దొరల పాలన ఇక చాలని వీడియోల ద్వారా ప్రచారం చేస్తోంది. మిగతా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ఇంతటి బలం లేదు. కానీ ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ కు చరమ గీతం పాడి కాంగ్రెస్ అధికారం కట్టబెట్టాలని ఓటర్లు భావిస్తున్నట్లు సర్వేలన్ని వెల్లడిస్తున్నాయి.