Modi in Nobel Race : భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుంది. ఆయనను పలు దేశాలు విశ్వగురువుగా సంబోధిస్తున్నాయి. అయితే నోబెల్ శాంతి బహుమతి రేసులో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారని గత రెండు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచానికి శాంతి సందేశం వినిపించడంలో ప్రధాని మోదీ ముందుంటారు. కరోనా లాంటి మహహ్మారి ప్రబలిన సమయంలోనూ అనేక దేశాలకు వ్యాక్సిన్లు, ఔషధాల ద్వారా ఆయన అండగా నిలిచారు. పలు దేశాలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లినా, భారత్ ను ఆ ప్రమాదం నుంచి కాపాడారు. ప్రపంచంలోని చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని దేశాలతో స్నేహాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో ఈసారి మోదీకే నోబెల్ శాంతి బహుమతి.. అంటూ ఆయన అభిమానులు, బీజేపీ శ్రేణులు సోషల్ మీడియాలో హోరెత్తిస్తు్న్నారు. దీనిపై పలు మీడియా సంస్థలు కూడా ప్రధానంగా తీసుకొని వార్తలు ప్రసారం చేయడంతో పాటు కథనాలు ప్రచురించాయి.
అయితే అసలేం జరిగిందంటే.. నార్వేకు చెందిన నోబెల్ అవార్డ్స్ కమిటీ ఇటీవల ఇండియాలో పర్యటించింది. కమిటీ డిప్యూటీ ఛైర్మన్ అస్లే టోజే కూడా ఇందులో ఉన్నారు. పర్యటనలో భాగంగా టోజే భారత ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. అన్ని దేశాలతో ఆయన కొనసాగిస్తున్న స్నేహసంబంధాన్ని కొనియాడారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ‘ఇది యుద్ధాల శకం కాదు..’ అంటూ ప్రధాని మోదీ గతంలో అన్నమాటను ఈ సందర్భంగా టోజే గుర్తు చేసుకున్నారు. ఈ వ్యాఖ్యలనే సాక్ష్యంగా చూపుతూ ప్రధాని మోదీకి ఈసారి నోబెల్ శాంతి బహుమతి దక్కే అవకాశం ఉందని ప్రచారం తెరపైకి తెచ్చారు. సోషల్ మీడియాలో దీనిపై ట్రోల్స్ కామెంట్లు పేలుతున్నాయి. ఇక బీజేపీ శ్రేణుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఏడాదిలో ఎన్నికలు ఉన్న వేళ ప్రధాని కి నోబెల్ శాంతి బహుమతి రావడం అదృష్టమని సంబురపడుతున్నారు.
అయితే ఇక్కడే కథ అడ్డం తిరిగింది. నోబెల్ అవార్డ్స్ కమిటీ డిప్యూటీ ఛైర్మన్ అస్లే టోజే వెంటనే రంగంలోకి దిగారు. బీజేపీ శ్రేణుల ట్రోల్స్ ధాటికి ఆయన వివరణ ఇచ్చారు. నోబెల్ శాంతి బహుమతి గురించి తాను ఎక్కడా ప్రకటన చేయలేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మోదీకి నోబెల్ శాంతి బహుమతి అంటూ వస్తున్న వార్తలన్నీ ఫేక్ అంటూ కొట్టిపడేశారు. ఇంతకుమించి ఈ అంశంపై మాట్లాడబోనని తెలిపారు. ఏం మాట్లాడినా, అవి వార్తలకు ఊతమిచ్చినట్లు అవుతుందని, మరిన్ని ట్రోల్స్ బయటకు వస్తాయని పరోక్షంగా కొందరిని ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు.