
Priyanka Gandhi Contesting Telangana : యువ సంఘర్షణ సభను విజయవంతంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సభ సక్సెస్ కావడంతో ఫుల్ జోష్ లో కనిపిస్తుంది. ఎలాగైనా ఈ సారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పథకాలు రచిస్తోంది రేవంత్ సేన. అందుకు తగ్గట్లుగా ఏఐసీసీలో ఛరిష్మా ఉన్న ప్రియాంకా గాంధీని సభకు రప్పించింది. గతంలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించగా, ఇప్పుడు ప్రియాంకా గాంధీ యూత్ డిక్టరేషన్ ప్రకటించారు.
కర్ణాటకలోని ఎన్నికలు ముగియడంతోనే తెలంగాణవైపే ప్రధాన దృష్టి అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ చెపారు. అందుకు తగ్గట్లుగా ఇక్కడి నాయకత్వం కూడా వ్యవహరిస్తుంది. ఇప్పటికే రెండు దఫాలుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించాలని కలలు గంటుంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా గుర్తంపు సంపాదించుకున్న కాంగ్రెస్ ఈ సారి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని చూస్తుంది.
తెలంగాణలో బండి సంజయ్ సారధ్యంలో బీజేపీ మంచి ఊపు మీద ఉంది. కాంగ్రెస్ కు మంచి క్యాడెర్ ఉన్నా దాదాపు పదేళ్లు అధికారంలో లేకపోవడంతో నిరాశలో ఉంది. వీరిని బూస్ట్ ఇచ్చేందుకు ఇప్పుడు ప్రియాంకా గాంధీ బరిలోకి దిగారు. ఆమె సభకు రావడం.. సీనియర్లతో మాట్లాడడం.. పార్టీ బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ సారి ఆమె తెలంగాణ నుంచే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏఐసీసీ తెలంగాణ బాధ్యతలను పూర్తిగా ప్రియాంకా గాంధీని అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ సభ ఒక ఎంట్రీ పాస్ లాంటిదేనని ఇక ఆమె తరుచూ రాష్ట్రానికి వస్తుంటారని పార్టీ సీనియర్ నేతలు చెప్తున్నారు. అయితే ఆమె పర్యటనను పార్టీని ప్రభుత్వంలోకి తెచ్చేలా మార్చుకోవాలని ఇక్కడి నేతలు భావిస్తున్నారు. ఈ సారి ఎంపీ ఎలక్షన్లలో ప్రియాంక గాంధీ తెలంగాణ రాష్ర్టం నుంచి నిలబెట్టాలని ఇక్కడి నాయకులు పావులు కదుపుతున్నారు. వచ్చిన ఆలోచనే తడువుగా హై కమండ్ దృష్టికి కూడా తీసుకెళ్లారు.
ఏఐసీసీ ముఖ్య నాయకురాలైన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా ఇక్కడి నుంచి గెలుపొంది ప్రధాని అయ్యారు. 1980లో జరిగిన ఎలక్షన్ లో కాంగ్రెస్ (ఐ) తరుఫున ఇందిరాగాంధీ మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఆ సమయంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. ఈ దఫా కూడా ఆమె మనుమరాలైన ప్రియాంకా గాంధీని కూడా తెలంగాణ నుంచే నిలబెట్టి గెలిపించుకోవాలని నాయకులు పావులు కదుపుతున్నారు.






