
Producer Suresh Babu : టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో దగ్గుబాటి సురేశ్ బాబు భారీ చిత్రాల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో చిన్న సినిమాలను కూడా తన డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి రిలీజ్ చేసి తన వంతు ప్రోత్సాహం అందిస్తున్నారు. కొంత కాలంగా పెద్ద సినిమాల నిర్మాణానికి దూరంగా ఉన్న ఈ టాప్ ప్రొడ్యూసర్ పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది తదితర చిన్న చిత్రాలకు ఫైనాన్షియల్ గా బ్యాక్ సపోర్టు ఇస్తూ కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలకు ప్రోత్సాహం అందిస్తున్నారు. ఆయన తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాల గురించి మాట్లాడారు.
బాక్సాఫీస్ కలెక్షన్ల ఆధారంగా పెద్ద స్టార్లు ఎవరనేది నిర్ణయించడం కష్టమని చెప్పారు. ఈ సందర్బంగా ప్రభాస్ , అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ సినిమాల గురించి కూడా మాట్లాడారు.
స్టార్ డమ్, పెద్ద హీరో అనే అంశాలపై స్పందించారు సురేష్ బాబు. పెద్ద హీరో అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదన్నారు. ప్రతీ హీరోకు ఫ్యాన్ ఫాలోయింగ్ బీభత్సంగా ఉంటుందన్నారు. కానీ సినిమా కలెక్షన్లు దర్శకుడిపై కూడా ఆధారపడి ఉంటాయని చెప్పుకొచ్చారు. ఒక్కోసారి స్టార్ హీరోల సినిమాలు కూడా మొదటి రోజే చేతులెల్తేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. అందుకే కలెక్షన్ల ఆధారంగా పెద్ద హీరోలను నిర్ణయించడం కరెక్టు కాదని చెప్పారు. టాలీవుడ్‌లో పవన్‌కల్యాణ్, ప్రభాస్ సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తాయని, అల్లు అర్జున్ కూడా భారీగా కలెక్షన్లు కొల్లగొట్టారని గుర్తు చేశారు. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ దేశంలోనే పెద్ద హీరో అని చెప్పలేమన్నారు. ‘బాహుబలి’, ‘కల్కి’ మధ్యలో ప్రభాస్ నటించిన కొన్ని సినిమాలు ప్లాఫ్ గా మిగిలాయన్నారు. పవన్ కల్యాణ్‌కు టాలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని, పవన్ చిన్న దర్శకులతో సినిమా చేసినా భారీ ఓపెనింగ్స్ వస్తాయని చెప్పారు. అలాగని ఏ సినిమా తీసినా ప్రేక్షకులు చూస్తారనుకోవడం పొరపాటు అవుతుందన్నారు. గతంలో పవన్ తీసిన ‘జానీ’ అంచనాలను అందుకోలేదని గుర్తు చేశారు. ఇదే చర్చ కోలీవుడ్‌లో కూడా జరుగుతున్నదన్నారు. కోలీవుడ్ లో అజిత్, విజయ్, రజనీకాంత్‌లలో పెద్ద హీరో ఎవరనేది చెప్పలేమన్నారు. ప్రేక్షకులకు సినిమాలు నచ్చితే కచ్చితంగా ఆదరిస్తారన్నారు. టాలీవుడ్ లో రూ.100 కోట్లు సాధించే హీరోలు ఇప్పుడు చాలామందే ఉన్నారన్నారు సురేశ్ బాబు.
టాప్ హీరోలతో ఇండస్ర్టీతో నడవదు..
స్టార్ హీరోలైన విజయ్, అజిత్‌లు సినిమాలు ఆపేస్తే తమిళ పరిశ్రమ భవిష్యత్తు ఏమిటనే దానిపైనా స్పందించారు. ‘‘కొందరు స్టార్ హీరోలు సినిమాలు మానేసినంత మాత్రాన పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు. ఆ తర్వాత స్థానంలో ఉన్నవాళ్లు కొత్త స్టార్లుగా ఎదుగుతారని చెప్పారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణించినప్పుడు సంగీత ప్రపంచం ఏమవుతుందా అని అందరూ అనుకున్నారని గుర్తు చేశారు. అదేం ఆగిపోలేదని, అలాగే స్టార్ హీరోలు సినిమాలు ఆపేస్తే వాళ్లే నష్టపోతారన్నారు. లోకల్ హీరోలు కొత్త స్టార్లుగా అవతరిస్తారని చెప్పారు.