Cricket World Cup Trophy History : ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి జరిగే క్రికెట్ వరల్డ్ కప్ గురించే దేశంతో పాటు ప్రపంచం మొత్తం చర్చిస్తోంది. టోర్నీకి సంబంధించి అనేక విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. మొత్తం 10 దేశాల జట్లు పోటీలో తలపడితే ఒక్క జట్టు మాత్రమే ట్రోఫీని దక్కించుకుంటుంది. ప్రతీ సారి వివిధ దేశాలలో నిర్వహించే టోర్నీకి ఈ సారి భారత్ వేదికగా మారింది. పుష్కరం తర్వాత భారత్ ఈ వేడుకకు ఆతిథ్యం ఇస్తుంది.
అక్టోబర్ 5వ తేదీ అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య ఫస్ట్ మ్యాచ్ జరగనుంది. వరల్డ్ కప్ కు సంబంధించి ‘ట్రోఫీ’ ప్రస్తుతం హైదరాబాద్ లో సందడి చేసింది. ఈ ట్రోఫీని హైదరాబాద్ లోని చార్మినార్, హుస్సెన్ సాగర్ వద్ద ఐసీసీ ప్రతినిధులు ఏర్పాటు చేసి వరల్డ్ కప్ కు ప్రచారం చేశారు. వరల్డ్ కప్ లో మూడు మ్యాచ్ లకు వేదికగా నిలిచే ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియాంలో ట్రోఫీని ప్రదర్శనకు ఉంచారు. ఈ ట్రోఫీ ఇప్పటి వరకు 18 దేశాలు తిరిగి వచ్చింది. అసలు ఈ ట్రోఫీ చరిత్ర గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
ప్రుడెన్షియల్ వరల్డ్ కప్-1975
క్రికెట్ వరల్డ్ ప్రయాణం 1975 నుంచి ప్రారంభమైంది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఫస్ట్ వరల్డ్ కప్ ను వెస్టిండీస్ కైవసం చేసుకుంది. ఈ టోర్నీ ఐసీసీ పరిధిలో నిర్వహించినా ‘ప్రుడెన్షియల్ వరల్డ్ కప్’ అని నామకరణం చేశారు. అయితే ‘ఫ్రుడెన్షియల్’ అనే భీమా కంపెనీ ఈ కప్ ను స్పాన్సర్ చేసింది.
ఫస్ట్ వరల్డ్ కప్ ట్రోఫీని వెండి, బంగారు లోహాలతో రూపొందించారు. లోపల వెండి, పై భాగంంలో బంగారు పూత వేశారు. ఆ తర్వాత 1979, 1983 ప్రపంచకప్ లో కూడా ఇదే బీమా కంపెనీ స్పాన్సర్ చేసింది. 1979లో విండీస్, 1983లో భారత జట్టు గెలుచుకుంది.
1987లో రిలయన్న్ ట్రోఫీ
వరల్డ్ కప్-1987ను రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పాన్సర్‌గా ఎంపికైంది. ఆ సంవత్సరం ‘రిలయన్స్ కప్’గా పిలిచారు. రిలయన్స్ కంపెనీ కూడా దెండి, బంగారం కలయికతో కప్ తాయారు చేసింది. గతంలో జరిగిన ప్రుడెన్షియల్ కంపెనీ లాగానే ట్రోఫీలో క్రికెట్ బాల్ చేర్చింది. ఇందులో అద్భుత ప్రతిభ చూపిన ఆస్ట్రేలియా ట్రోఫీ కైవసం చేసుకుంది.
బెన్సన్ అండ్ హెడ్జెస్-1992
రిలయన్స్ కంపెనీ కేవలం ఒకే ఒక్క సారి స్పాన్సర్ గా వ్యవహరించింది. ఆ తర్వాత 1992లో మరో కొత్త స్పాన్సర్ పుట్టుకచ్చింది. బెన్సన్ అండ్ హెడ్జెస్ అనే బ్రిటీష్ సిగరేట్ కంపెనీ నిర్వహించింది. కాబట్టి ఈ ఏడాది టోర్నీని బెన్సన్ అండ్ హెడ్జెస్ కప్ గా పిలుచుకున్నారు. ఈ సంవత్సరం పాకిస్తాన్ కప్ సొంతం చేసుకుంది.
1996 విల్స్ వరల్డ్‌కప్
బ్రిటీష్ సిగరేట్ కంపెనీ కూడా ఎక్కువ కాలం తన ప్రయాణాన్ని కొనసాగించలేదు. 1996 వరల్డ్ కప్ ను ‘విల్స్’ అనే మరో సిగరేట్ సంస్థ స్పాన్సర్ చేసింది. దీన్ని వీల్స్ కప్ 1996 అని పిలిచారు. ఈ కప్ ను శ్రీలంక దక్కించుకుంది.
ఐసీసీ కీలక నిర్ణయం..
1996 తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీలకంగా నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం నుంచి కొత్త ట్రోఫీని తయారు చేసింది. ట్రోఫీ తయారీ బాధ్యతను లండన్ లోని ‘గారార్డ్’ అనే జ్యువెల్లరీ సంస్థకు అప్పగించింది. దీని తయారీకి 2 నెలల సమయం పడుతుంది. వెండితో తయారు చేసిన ట్రోఫీ పై బంగారు పూత పూస్తారు.
60 సెం. మీ. ఎత్తు..
60 సెంటీమీటర్ల ఎత్తుతో ఉన్న ఈ ట్రోఫీ పైన బంగారు వర్ణంలో గ్లోబు ఉంటుంది. ఈ గ్లోబ్‌కు సపోర్ట్‌గా మూడు సిల్వర్ కాలమ్స్ ఉంటాయి. ఈ సిల్వర్ కాలమ్‌లు స్టంప్‌లు, బెయిల్స్ ఆకారంలో నిలువు వరుసలో ఉంటాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ను ప్రతిబింబించేలా ఈ ట్రోఫీ తాయారు చేశారు. గుండ్రంగా ఉన్న గ్లోబ్ క్రికెట్ బంతిని సూచిస్తుంది. ఈ ట్రోఫీని ప్రత్యేక కొలతతో తయారు చేశారు. ఏ కోణం నుంచి చూసిన ట్రోఫీ ఒకేలా ఉంటుంది. ఈ ట్రోఫీ 11 కిలోల వరకు బరువు ఉంటుంది.
ధర ఎంతంటే ?
ట్రోఫీ తయారీకి ప్రస్తుత ధరల ప్రకారం దీని ధర రూ. 30,85,320 ఉంటుంది. విజేతకు కప్ అందజేశారు. విజేత జట్టు పేరు ట్రోఫీ కింది భాగంలో ముద్రిస్తారు. ట్రోఫీకి సంబంధించి నకలును మాత్రమే గెలిచిన జట్టుకు అందిస్తారు. అసలు ట్రోఫీ మాత్రం ఐసీసీ దుబాయ్ లోని తన కార్యాలయంలో ఉంచుతుంది. 1999 వరల్డ్‌కప్ కోసం తాయారు చేసిన ట్రోఫీనే ఐసీసీ బహుకరిస్తూ ఉంటుంది.