Raja Reddy Wedding : ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి, వధువు ప్రియా అట్లూరి వివాహ వేడుకకు సంబంధించి రోజుకో వేడుక జరుగుతోంది. 17వ తేదీ క్రిస్టియన్ పద్ధతిలో రింగులు మార్చి వివాహం చేసుకున్న రాజారెడ్డి, ప్రియా దంపతులు 18వ తేదీ హిందూ సంప్రదాయ పద్ధతిలో ఒక్కటయ్యారు. హిందూ సంప్రదాయం ప్రకారం వేద మంత్రాల సాక్షిగా తలంబ్రాలు, తాళి, మట్టెలు పెట్టి రాజారెడ్డి ప్రియను తన భాగస్వామిగా చేసుకున్నారు.
దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీటిని వైఎస్ షర్మిల తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది. మొన్న రాత్రి క్రిస్టియన్ పద్ధతిలో రింగులు మార్చుకొని పెళ్లి చేసుకున్నట్లు అర్థమవుతోంది. ఈ రోజు, షర్మిల కొత్త ఫొటోలను పంచుకున్నారు, వీటిలో, ఈ జంట సరైన హిందూ శైలిలో వివాహం చేసుకున్నట్లు మనం చూడవచ్చు.
గత రాత్రికి భిన్నంగా, షర్మిల షేర్ చేసిన ఈ కొత్త ఫొటోల్లో యువ జంట హిందూ దుస్తుల్లో కనిపిస్తుంది. కెమెరాలకు ఫోజులు ఇస్తూ కుటుంబ సభ్యులంతా చిరునవ్వులు చిందిస్తున్నారు. క్రిస్టియన్ స్టయిల్ లో, హిందూ స్టియిల్ లో ఈ జంట పెళ్లి చేసుకోవడం ఈ మధ్య కాలంలో ఆనవాయితీగా మారింది.
రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో వైఎస్ కుటుంబం అంగరంగ వైభవంగా వివాహ వేడుకను నిర్వహించింది. త్వరలో హైదరాబాద్ లో షర్మిల గ్రాండ్ రిసెప్షన్ ఇవ్వనున్నారని, ఈ కార్యక్రమానికి గత రెండు నెలలుగా షర్మిల ఆహ్వానించిన ప్రత్యేక ఆహ్వానితులు హాజరవుతారని తెలిపారు.