టీడీపీ : గోరంట్ల బుచ్చయ్య చౌదరి(ప్రస్తుత ఎమ్మెల్యే)
జనసేన : కందుల దుర్గేశ్
వైసీపీ : చందన నాగేశ్వర్
Rajahmundry Rural Constituency Review గోదావరి జిల్లాల్లో అత్యంత ప్రతిష్టాత్మక నియోజకవర్గంగా రాజమండ్రి రూరల్ కు పేరుంది. ప్రస్తుతానికి ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉంది. దశాబ్దాల కాలంగా ఇక్కడ టీడీపీ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తిరుగులేని నేతగా ఎదిగి, గెలుస్తూ వస్తున్నారు. గోరంట్లకు ఇక్కడ పెద్ద ఎత్తున జనం నుంచి సపోర్ట్ ఉంది. నియోజకవర్గంతో పాటు రాష్ర్టంలో కూడా సీనియర్ నేతగా గోరంట్ల కు పేరుంది. ఎన్టీఆర్ హయాం నుంచి చంద్రబాబు వరకు ఆయనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలోనూ ఆయన టీడీపీ నుంచి విజయం సాధించారు. అయితే గోరంట్లను ఎదుర్కొనే నేత ఇప్పటికైతే రాజమండ్రి రూరల్ లో లేరనే అభిప్రాయం స్థానికుల నుంచి వినిపిస్తున్నది.
అయితే గోరంట్ల ఇప్పటికే వయోభారంతో ఉన్నారు. పార్టీ యువనేతకు అవకాశం ఇవ్వాలని అనుకుంటే గోరంట్లకు ఇబ్బందులు తప్పేలా లేవు. అయితే నియోజకవర్గంలో సీనియర్ నేతగా ఉన్న ఆయనను కాదంటే టీడీపీకి తిప్పలు తప్పేలా లేవు. మరోవైపు పొత్తులో భాగంగా ఈ సీటు జనసేన కు ఇస్తే కందుల దుర్గేశ్ కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ నుంచి జనసేన లో చేరి కష్టపడుతున్నారు. అయితే పొత్తులో భాగంగా ఎవరికి ఇచ్చిన మిగతా పార్టీ వారు మద్దతు ఇస్తారా లేదా అనేది కొంత సంశయంగా కనిపిస్తున్నది. సీనియర్ నేతగా నియోజకవర్గంపై పట్టున్న గోరంట్లను కాదని జనసేన కు ఇస్తే టీడీపీ శ్రేణులు సపోర్ట్ చేసే అవకాశాలు ఉండవని అంతా అనుకుంటున్నారు. రాజమండ్రి రూరల్ లో తిరుగులేని నేతగా గోరంట్ల ఎదిగారు.
అయితే అధికార వైసీపీ నుంచి 2019 ఎన్నికల్లో ఓడిపోయిన ఆకుల వీర్రాజును ఆ పార్టీ పక్కన పెట్టినట్లే కనిపిస్తున్నది. అయితే ఈసారి చందన నాగేశ్వర్ కు అవకాశం ఇచ్చేలా కనిపిస్తున్నది. ఆయన ఈసారి జోరుగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గడగడపకూ ప్రభుత్వం అంటూ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ అందరినీ కలుస్తున్నారు. గోరంట్లను ఎలాగైనా ఓడించాలని తహతహలాడుతున్నారు.
వైసీపీ అధినేత సీఎం జగన్ కూడా ఈసారి రాజమండ్రి రూరల్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ టీడీపీ కంచుకోట దెబ్బ కొట్టాలని ఆయన కూడా పక్కా వ్యూహం రచిస్తున్నారు. నియోజకవర్గంలోని నేతలకు ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. అనుకున్న స్థాయిలో ఆయన ఆకట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికైతే రాజమండ్రి రూరల్ లో టీడీపీని ఢీకొట్టే నేత కనిపించడం లేదని అంతా భావిస్తున్నారు. సరైన బలమైన నేత ఇప్పటికైతే వైసీపీకి లేనట్లే కనిపిస్తున్నది. అయితే 2024 ఎన్నికల్లో కూడా గోరంట్ల గెలుపు ఖాయమనే ధీమా వ్యక్తమవుతున్నది.