Ramoji Film City: ఈనాడు మీడియా సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. వయోభారం రీత్యా పలు ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన కొంతకాలంగా మంచానికే పరిమితమయ్యారు. శనివారం ఉదయం నానక్ రామ్ గూడ లోని స్టార్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. నిన్న మధ్యాహ్నం మూడుగంటలకు తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనకు స్టార్ హాస్పిటల్స్ వైద్యులు చికిత్స అందించారు. నిన్న రాత్రి ఆయన ఆరోగ్యం విషమించడంతో వెంటిలేటర్ మీదే ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా ఆయన కన్నుమూసినట్లుగా అధికారికంగా ప్రకటించారు.
రామోజీరావు 1996లో ఈ ఫిలిం సిటీని స్థాపించారు. ఈ ఫిలిం సిటీ పర్యాటక ప్రదేశంగా పేరుగాంచింది. ఈ ఫిలిం సిటీ సుమారు 2000 ఎకరాలలో విస్తరించి ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత ఫిలిం సిటీ ఇదే. హైదరాబాదు నగరం నుండి 25 కిలోమీటర్ల దూరములో ఉన్న ఈ ఫిలిం సిటీలో తెలుగు సినిమాలే కాకుండా దేశ, విదేశాలకు చెందిన అనేక భాషా చిత్రాలు, టీవీ సీరియల్స్ నిర్మిస్తారు. ఇందులో వివిధ దేశాలలోని పూల తోటలు, రకరకాల దేశ విదేశీ శిల్పాలు, సినిమాలకు కావాల్సిన అనేక రకాలు ఫిక్స్డ్ సెట్స్ ఉన్నాయి. లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్‌సిటీ ఇన్ ది వరల్డ్ గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం పొందింది. ఈ ఫిల్మ్‌సిటీలో బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు సైతం షూటింగ్ జరుపుకుంటాయి.
సినిమా షూటింగ్ లొకేషన్లు, సెట్టింగ్‌లు, సాంకేతిక సామగ్రి, సదుపాయాలు ఒకేచోట లభించే విధంగా ఫిల్మ్‌సిటీని రామోజీరావు ఏర్పాటు చేశారు. ఇక్కడికి రాని ఇండియన్ సినీ ప్రముఖులు లేరనడంలో అతిశయోక్తి లేదు. ఏడాదికి సగటున 13 లక్షల మంది పర్యాటకులు ఫిల్మ్ సిటీని సందర్శిస్తుంటారు. ఉర్దూ నుంచి కన్నడం వరకు, గుజరాతీ నుంచి బెంగాలీ వరకు ఎన్నో ప్రాంతీయ భాషలకు చెందిన టీవీ ఛానళ్లు తెలుగు నేలపై ఆవిష్కరించడం రామోజీరావుకు మాత్రమే కాదు.. మన హైదరాబాదుకు కూడా కీర్తిని తెచ్చిపెట్టింది. ఇక ఫిల్మ్ సిటీతో పాటు రామోజీరావు ఉషాకిరణ్ మూవీస్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను కూడా స్థాపించారు. ఫిల్మ్ సిటీలో దాదాపు 2500కు పైగా సినిమాలు చిత్రీకరణ జరుపుకున్నట్లు అంచనా. ఇక్కడ చిత్రీకరించిన కొన్ని బ్లాక్‌బస్టర్‌లలో చెన్నై ఎక్స్‌ప్రెస్, క్రిష్, బాహుబలి, డర్టీ పిక్చర్ లాంటివి సినిమాలు ఉన్నాయి.