Rapid sanitation work : విజయవాడలో ప్రభుత్వ సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అగ్నిమాపక సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందితో పాటు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది విజయవాడకు చేరుకున్నారు. సెలవులు కూడా తీసుకోకుండా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సహాయ కార్యక్రమాలను మంత్రులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇళ్లు, రోడ్లు శుభ్రం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 113 ఫైర్ ఇంజన్లు విజయవాడకు చేరుకున్నాయి. బుధవారం 50 ఫైర్ ఇంజన్లతో పనులు ప్రారంభించిన అధికారులు.. నేడు వాటి జోరు పెంచేందుకు సిద్ధమయ్యారు. వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తూనే, వరద తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో బాధితుల ఇళ్లు, వీధులను అగ్నిమాపక యంత్రాలతో శుభ్రం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
విజయవాడలోని మొత్తం 32 డివిజన్లు ముంపునకు గురయ్యాయని అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. వరద ఉధృతి తగ్గిన ప్రాంతాల్లో ఏ రోజు ఇళ్లను శుభ్రం చేస్తున్నామని తెలియజేశారు. పలు ప్రాంతాల్లో రోడ్డుపై నిలిచిన నీటితో బాధితులు ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. ఇళ్లలోకి వరద రావడంతో పలుచోట్ల కొట్టుకుపోవడంతో పాటు ఉన్నవి కూడా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల నుంచి పెద్ద సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికులు విజయవాడకు తరలివచ్చారు. ముంపు ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తున్నారు. మురుగు కాలువల్లోని మట్టిరోడ్లపై మట్టి, ఇసుక గుట్టలను శుభ్రం చేస్తున్నారు. రోడ్లపై చెత్తతో పాటు బాధితులకు ఆహార పొట్లాలు, వాటర్ బాటిళ్లు ఎక్కువగా ఉన్నాయని పారిశుధ్య కార్మికులు తెలిపారు.
వరద తగ్గిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను ప్రజాప్రతినిధులు నిశితంగా పరిశీలిస్తున్నారు. మంత్రుల మధ్య పని విభజన జరుగుతుంది. 200కు పైగా అగ్నిమాపక వాహనాలతో ఈ పనులు వేగవంతం చేశామని హోంమంత్రి అనిత వెల్లడించారు. బురదమయమైన వీధులతో పాటు ముంపునకు గురైన ప్రతి ఇంటిని శుభ్రం చేస్తామని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఇతర జిల్లాల నుంచి కూడా ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ఫైర్, శానిటేషన్, మునిసిపల్ సిబ్బంది కలిసి, తమ ఇల్లు మొత్తం శుభ్రం చేసారని విజయవాడ వరద బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఆలోచనతో ఫైర్ ఇంజిన్లు పెట్టి మరీ ఇళ్లు శుభ్రం చేయటం అనేది అసలు ఊహించలేదు సింగ్ నగర్ ప్రజలు అంటున్నారు.