
Ratan Tata Friend Shantanu Naidu: దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా జీవిత చరమాంకంలో ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి శంతను నాయుడు. చివరి దశలో టాటాకు కేర్‌టేకర్‌గా, జనరల్ మేనేజర్‌గా వ్యవహరించారు. తాజాగా ఆయనకు టాటా గ్రూప్‌లో కీలక పదవి లభించింది. టాటా మోటార్స్ (Tata Motors)లో స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్‌కు జనరల్ మేనేజర్‌గా శంతను నియమితులయ్యారు. ఈ విషయాన్ని తన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో షేర్ చేస్తూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
‘‘టాటా మోటార్స్ ప్లాంట్ నుంచి తెల్ల షర్టు, నేవీ బ్లూ ప్యాంట్‌లో నా తండ్రి (రతన్ టాటాను ఉద్దేశిస్తూ) నడుచుకుంటూ ఇంటికి వచ్చేవారు. ఆ సమయంలో నేను ఆయన కోసం ఎదురుచూస్తూ కిటికీలో నుంచి చూసేవాడిని. ఇప్పుడు నేను కూడా అలా నడిచొచ్చే రోజులు వచ్చాయి’’ అని శంతను రాసుకొచ్చారు.టాటా ట్రస్ట్‌లో పిన్న వయస్కుడైన శంతను 2018 నుంచి రతన్ టాటాకు అసిస్టెంట్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో 80ల్లో ఉన్న టాటాకు.. ఈ యువకుడికి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. వీరిద్దరిని కలిపింది వీధి శునకాలపై ఉన్న ప్రేమే. రతన్ టాటాకు జనరల్ మేనేజర్‌గా, అత్యంత విశ్వాసపాత్రుడిగా మారారు.
గతేడాది అక్టోబరులో రతన్ టాటా తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆ సమయంలో శంతను తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన మార్గదర్శిని గుర్తుచేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టారు. ‘‘మీ నిష్క్రమణతో మన స్నేహంలో శూన్యం మిగిలింది. ఆ లోటును అధిగమించడానికి జీవితాంతం ప్రయత్నిస్తాను. ఈ ప్రేమ దూరమవడంతో కలిగిన దుఃఖం పూడ్చలేనిది. గుడ్‌బై మై డియర్ లైట్‌హౌస్’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.