Ambati Rayudu : భారత మాజీ క్రికెటర్, ఏపీకి చెందిన ఆటగాడు అంబటి రాయుడు రాజకీయ రంగ ప్రవేశానికి సర్వం సిద్ధమైంది. ఆయన వైసీపీ కండువా కప్పుుకోవడం దాదాపు ఖాయమైపోయింది. ఇప్పటికే పలుమార్లు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ను ఆయన కలిసి ఈ మేరకు తన మనసులో మాట చెప్పారు. దీంతో పాటు ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారో అక్కడ గ్రౌండ్ వర్క్ కూడా మొదలుపెట్టారు. ఎన్నికలకు ఇంకా ఏడాదే మిగిలి ఉండడంతో ఇఫ్పటి నుంచే ఆయన అంతా సిద్ధం చేసుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితి, తన ప్రభావంపై ఒక అంచనాకు వచ్చేందుకు ఆయన పలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు.
ప్రస్తుతం గుంటూరు జిల్లాలో అంబటి రాయుడు పర్యటిస్తున్నారు. గుంటూరు జిల్లా నుంచి ఆయన వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేయాలనుకుంటున్నారు. దీంతో ఆయన ఇక్కడే పలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. అయితే ఆయన గ్రామాల పర్యటనను వైసీపీ భాగస్వామి ఐ ప్యాక్ తెర వెనుక కోఆర్డినేట్ చేస్తోంది. అయితే గ్రామాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనట్లు సమాచారం. తాజాగా ఆయన తెనాలి సమీపంలోని కొలకలూరు గ్రామంలో పర్యటించారు. అక్కడ రైతుల్ని సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. గుర్తింపు కార్డుల కోసం కౌలు రైతులు , ధాన్యం కొనుగోలు సమస్యలు, సీసీఎల్ ఫ్యాక్టరీ వల్ల నీటి కాలుష్యం, రోడ్ల దుస్థితి, క్వారీ కబ్జా, బీసీ కులవృత్తులు చేసుకునేవారికి పని ముట్లు ఇలా లెక్కలేనన్ని సమస్యలు చెప్పారు. ఏదో మాట్లాడుదామని వస్తే ఆయనకు జనమంతా వందల సమస్యలు చెప్పుకొచ్చారు. దీంతో ఏం చేయాలో రాయుడికి అర్ధం కాలేదంట. చివరకు రాజకీయ నాయకుడిలాగా అందరికీ అండగా ఉంటానని భరోసానిచ్చారు. కానీ మీడియాతో మాత్రం.. అసలు అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వపరంగా మంచి సపోర్ట్ అందుతుందని రైతులు తెలిపారని, స్కూళ్లు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. అసలు గ్రామాల్లో సమస్యలే లేవని, ప్రజలంతా జగన్ పాలనలో సంతోషంగా ఉన్నారని చెప్పారు. దీంతో అక్కడే ఉన్న కొందరు రైతులు ఇది విని అవాక్కయ్యారు. ఇన్ని సమస్యలు చెప్పుకున్నా, ఏం లేవని రాయుడు మాట్లాడడంపై వారు పెదవి విరిచారు.
అయితే అంబటి రాయుడు ఇంకా రాజకీయాల్లో ఓనమాలే దిద్దలేదు. అప్పుడే తనస్థాయి రాజకీయాలు మొదలుపెట్టాడు. క్రికెట్ లోనూ పలు వివాదాలకు కారణమైన రాయుడు మరి రాజకీయాల్లో ఎన్ని వివాదాలను తలనెత్తుకుంటారో వేచి చూడాలి. ఏదేమైనా ఎంతో స్టార్ భవిష్యత్ ఉన్న రాయుడు రాజకీయ రంగంలోకి దిగడం, తలపండిన రాజకీయ నాయకులను ఢీకొట్టడం సాధ్యమవుతుందా అనేది వేచిచూడాలి.
ReplyForward
|