Red Ant Chutney : ప్రాంతాలను బట్టి రుచులు, అభిరుచులు మారుతుంటాయి. కొన్ని ప్రాంతాల్లో అత్యంత ఇష్టంగా తినే వంటకం.. మరి కొన్ని ప్రాంతాల్లో వారికి అంతగా ఇష్టం ఉండకపోవచ్చు. అలాంటి వంటకమే ‘ఎర్ర చీమల పచ్చడి’.
ఎర్ర చీమల పచ్చడి గిరిజనులకు ఇష్టమైన వంటకం. దీన్ని ఇప్పటికీ ఆదివాసులు ప్రధాన వంటకంగానే భావిస్తారు. నాగరికతకు అలవాటు పడిన చాలా మందికి ఇది కొత్తగా అనిపించవచ్చు. ఒరిస్సాలో ఈ ఎర్ర చీమల పచ్చడి భౌగోళిక గుర్తింపును దక్కించుకుంది. ఇందులో అనేక వంటకాలు ఉంటాయని పరిశోధకులు కనుగొన్నారు.
మయూర్‌భంజ్ జిల్లాలో ఎక్కువగా ఈ చట్నీ చేస్తారు. ఈ వంటకంలో ఔషధ గుణాలతో పాటు అనేక బెనిఫిట్స్ ఉన్నాయట. స్థానికంగా దీన్ని ‘కై చట్నీ’ అంటూ పిలుస్తారు. జనవరి 2వ తేదీ ఈ విచిత్రమైన వంటకానికి గుర్తింపు లభించింది.
తయారీ.. ప్రయోజనాలు
కీటకాలతో వంటకాలను చేయడానికి ‘ఎంటోమో ఫాగి’ అంటారు. ఒడిస్సా ప్రజలు ‘రెడ్ వీవర్ చీమలు’, శాస్త్రీయ నామం ‘ఓకోఫిల్లా స్మరాగ్డినా’. మయూర్‌భంజ్ అడవుల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఈ చీమలతో ప్రజలు చట్నీని చేసి అమ్ముతుంటారు. వందలాది గిరిజన కుటుంబాలు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి.
ఈ చీమలను పట్టుకోవడం అంత సులభమైన విషయం కాదు. ఈ జాతిలో మగవి చాలా క్రూరంగా ప్రవర్తిస్తాయి. కుట్టితే విపరీతమైన నొప్పి, మంట కలుగుతుంది. ఈ చీమలను దంచి చూర్ణంగా చేసి ఎండబెడతారు. ఆ తర్వాత ఉప్పు, అల్లం, మిరపకాయలు, వెల్లుల్లి, కలిపి గ్రైండ్ చేసి చట్నీగా చేస్తారు.
ఈ చీమల పచ్చడితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దగ్గూ, ఫ్లూ, శ్వాస సమస్యలు, జలుబు, అలసట తగ్గిస్తుంది. చీమలు, వాటి గుడ్లలో ఉండే ఫార్మిక్ యాసిడ్, మానవ జీర్ణ వ్యవస్థలోని చెడు బ్యాక్టీరియాను నిర్మూలించడంలో ఉపయోగపడుతుంది. దీనిలో జింక్, కాల్షియం, ప్రోటీన్లు ఉంటాయి. ఇది రోగనిరోధక వ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటుంది.