
Relief for Jagan : జగన్ ప్రభుత్వానికి సుప్రీంలో రిలీఫ్ లభించింది. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించవచ్చని స్పష్టం చేసింది. ఆర్-5 జోన్ కేసులో హైకోర్టు ఉత్తర్వులపై రైతులు సుప్రీంను ఆశ్రయించారు. రాజధాని కేసులు విచారిస్తున్న బెంచ్ కు గతంలో ఈ కేసు బదిలీ చేశారు. అక్కడ ఈ రోజు (మే 17) విచారణ జరిగిన తరువాత సుప్రీం తీర్పు ఇచ్చింది. ఆర్ 5 జోన్ లో ఇంటి స్థలాలు కేటాయించవచ్చని చెబుతూనే.. హైకోర్టులో వచ్చే తుది తీర్పునకు కట్టుబడాలని సుప్రీం స్పష్టం చేసింది.
అయితే పేదలకు రాజధాని అమరావతి పరిధిలో ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన 50 వేల మంది పేదలకు స్థలాలు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం తీర్మానించింది. దీనిపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అక్కడ ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ నెల 18న సీఎం జగన్ అమరావతిలో పేదలకు ఇంటి స్థలాల పంపిణీకి ముహూర్తంగా నిర్ణయించారు. ఇదే సమయంలో హైకోర్టు తీర్పుపై అమరావతి రైతులు సుప్రీంను ఆశ్రయించారు. ఆర్-5 జోన్‌లో వేరే ప్రాంతాల వారికి ఇంటి స్థలం కేటాయింపుపై హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని, రాష్ట్ర ప్రభుత్వ జీవోలను రద్దు చేయాలని సుప్రీంను కోరారు రైతులు. రాష్ట్ర రాజధాని మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవోలు తెచ్చిందని రైతులు సుప్రీం కోర్టుకు విన్నవించుకున్నారు.
సుప్రీంకోర్టు తీర్పు..
సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో ఆర్-5 జోన్‌పై తదుపరి విచారణ వరకూ స్టే ఇవ్వాలని రైతుల తరపు న్యాయవాది బెంచ్ ను అభ్యర్థించాడు. దీంతో ఈ కేసును కూడా అమరావతి కేసులు విచారిస్తున్న బెంచ్ కు బదిలీ చేయాలని సుప్రీం నాడు రిజిస్ట్రీకి సూచించింది. బుధవారం సుప్రీంకోర్టులో తిరిగి ఈ అంశం పైన విచారణ జరిగింది. దీనిపై తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ఇంటి స్థలాలు ఇవ్వచ్చని చెప్తూనే హైకోర్టు తుది తీర్పునకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. దీంతో కొంత కాలంగా ఆర్ 5 జోన్ ఇంటి స్థలాల కేటాయింపు పైన కొనసాగుతున్న న్యాయ వివాదంలో స్పష్టత వచ్చినట్లు తెలుస్తోది. ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న నిర్ణయం మేరకు పేదలకు ఇంటి స్థలాల పంపిణీకి అడుగులు వేస్తోంది.
దాదాపు 50 వేల మందికి స్థలాలు ఇచ్చేందుకు రెండు విడతలుగా సీఆర్డీఏ భూ కేటాయింపులు చేసింది. 18వ తేదీనే సీఎం ఇంటి స్థలాలు పంపిణీ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. న్యాయ పరంగా సమస్యలు లేకుండా పరిష్కారం దిశగా అడుగులు వేస్తూనే స్థలాల కేటాయింపునకు చర్యలు ప్రారంభించింది జగన్ ప్రభుత్వం. ముందు నుంచి చేస్తున్న వాదనకు అనుగుణంగా ఇప్పుడు సుప్రీం కోర్టు అమరావతి పరిధిలో ఇంటి స్థలాలు ఇచ్చేందుకు అనుకూలంగా తీర్పు చెప్పడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం అమలు చేసేందుకు అడుగులు వేయనుంది. ఈ తీర్పుతో రాజధాని పరిధిలో పేదలకు ఇంటి స్థలాల పంపిణీకి మార్గం సుగమం అయ్యింది.