
Modi Vs Rahul Gandhi : నేడు దేశంలో రాజకీయాలు గమ్మత్తుగా తయారయ్యాయి. రాష్ట్ర రాజకీయాలు కులాల మధ్య చిక్కుకొని అస్తిత్వాన్ని పెంచుకుంటుంటే.. దేశ రాజకీయాలు మతాల మాటున ఎదిగిపోతున్నాయి. ఇక్కడ కమ్మ, కాపు, రెడ్డి, బీసీ, ఎస్సీ, అని విభజించి ఓట్లు దండుకుంటుంటే.. కేంద్రంలో హిందూ, నాన్ హిందూ అంటూ ఓట్లు దండుకుంటున్నారు.
పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సోమవారం (జూలై 1) రోజున జరిగింది. ఈ సందర్భంలో కేంద్రంపై రాహుల్ విమర్శలు గుప్పించారు. నేతలందరూ హింస గురించి మాట్లాడారు. కానీ హిందువులమని చెప్పుకునే వారు హింస, ద్వేషం, అబద్దాల గురించి ప్రసంగిస్తున్నారు అంటూ బీజేపీని ఉద్దేశించి అన్నారు.
దీంతో పాలకపక్షం పెద్దలు హింసను ధర్మంతో జోడించి మాట్లాడడం రాహుల్ కు సరికాదని, విపక్షనేత హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ చర్చలో ప్రధాని మోడీ ప్రతిపక్ష నేత రాహుల్ మధ్య కాసేపు మాటల యుద్ధం సాగింది. హిందూ సమాజాన్ని హింసా వాదులతో పోల్చడం సీరియస్ మేటర్ అంటూ మండిపడ్డారు మోడీ.
మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ మాత్రమే హిందూ సమాజం కాదని కౌంటర్ ఇచ్చారు రాహుల్. ఆలయాల నిర్మాణం పేరుతో స్థానికుల భూములను లాక్కొని విమానాశ్రయాలు కట్టారు. అయోధ్య రామాలయం ప్రారంభానికి కార్పొరేట్ పెద్దలకు మాత్రమే ఆహ్వానాలు అందించిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు.
అయోధ్యలో చిరు వ్యాపారుల దుకాణాలు, భవనాలను తొలగించిన బీజేపీ వారిని రోడ్డున పడవేసిందని ఆరోపించారు. మందిర ప్రారంభ సమయంలో బాధితులను లోనికి అనుమతించలేదు. యూపీలో అద్భుతమైన రామ మందిరం నిర్మించామని గొప్పలు చెప్పుకున్న ఆ పార్టీకి ఆ రాష్ట్రంలో ఎదురుబెబ్బ తగలడమే హింసకు ప్రత్యక్ష నిదర్శనం అంటూ రాహుల్ అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్.. మోడీ, రాహుల్.. మధ్య జరిగిన ఈ చర్చలను లోతుగా పరిశీలిస్తే హిందూ సమాజాన్ని రెచ్చగొడుతున్నారు, ఒక మతాన్ని పట్టుకొని రాజకీయ చేస్తున్నారు అంటూ ఒకరు అంటే.. హిందూ సమాజం అంటే బీజేపీ కాదంటూనే నాన్ హిందూ మతాల వారిని ఆకర్షించే ప్రయత్నం మరొకరు చేస్తున్నారు. మనిషి టెక్నాలజీగా ఏ స్థాయికి ఎదిగినా రాజకీయాలు కులాలు, మతాల చుట్టే తిరుగుతున్నాయి అనేందుకు ఇదే నిదర్శనం.
‘మేకిన్ ఇండియా’ అంటూ ప్రపంచం ముందు నిలబడినా ‘మేకిన్ పొలిటిషన్స్’ అంటూ రాజకీయ సమాజం ఎదుట దిగజారిపోతున్నాం. మనిషి అంతరిక్షంలోకి వెళ్లినా.. రోదసిలో రాకెట్లు ఎగరేసినా.. సముద్రగర్భంలో ఏముందో బయట పెట్టినా ఇంకా కులం, మతం చూసి మానవత్వాన్ని నిర్ధేశించే స్థాయిలోనే భారత రాజకీయాలు ఆగిపోతున్నాయా?