
ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చినా తెలంగాణ ముఖ్యమంత్రి కావాలన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆశలను కర్ణాటక కాంగ్రెస్ లో తాజా రాజకీయ పరిణామాలు భగ్నం చేసినట్లు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ కర్ణాటక శాఖ రాష్ట్ర అధ్యక్షుడిగా కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చింది డీకే శివకుమార్ అయినప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ సీనియర్ నేత సిద్ధరామయ్యను సీఎంగా ఎంచుకుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి జూనియర్ల కృషితో సంబంధం లేకుండా సీఎం పదవులకు జూనియర్ల కంటే సీనియర్లకే మొగ్గు చూపే సంప్రదాయాన్ని కాంగ్రెస్ అధిష్టానం కొనసాగిస్తోంది. రాజస్థాన్ లోనూ కాంగ్రెస్ ఇదే వైఖరిని అవలంభించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్తాన్ లో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు సచిన్ పైలట్ కారణమైనప్పటికీ, కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ ను సీఎంగా ఎంపిక చేసింది. సచిన్ పైలట్ తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో కాంగ్రెస్ ఆయనను ఉపముఖ్యమంత్రి పదవితో పాటు రాజస్తాన్ లో పార్టీ అధ్యక్ష పదవి నుంచి కూడా తొలగించింది.
కనీసం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాతనైనా కాంగ్రెస్ అధిష్టానం తన సంప్రదాయాన్ని మార్చుకుంటుందని రేవంత్, ఆయన మద్దతుదారులు ఆశించారు. అయితే మళ్లీ అదే సంప్రదాయాన్ని కొనసాగించడంతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం పదవితో సంతృప్తి చెందాల్సి వచ్చింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ఒక వేళ అధికారంలోకి వస్తే రేవంత్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కుతుందని, సీనియర్ కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు తదితరులను సీఎం పదవికి పరిగణనలోకి తీసుకోవచ్చని రేవంత్, ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు. తిరుగుబాటు జెండా ఎగురవేస్తే రాజస్థాన్ లో సచిన్ పైలట్ కు పట్టిన గతే తమకు పడుతుందని వారు భయపడుతున్నట్లు సమాచారం.