Lagacharla : లగచర్లలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటుకు చేపట్టిన భూసేకరణ నోటిఫికేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లు శుక్రవారం ప్రకటనలో పేర్కొంది. లగచర్లకు చెందిన 632ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 580 మంది రైతుల నుంచి ఈ భూమిని సేకరించాలని 2024, ఆగస్టు 1న ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే తాజాగా ఈ నోటీఫికేషన్ ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
దుద్యాల మండలంలోని నాలుగు గ్రామాల పరిధిలో ఫార్మా క్లస్టర్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు లగచర్లలో 632 ఎకరాల పట్టా భూమిని సేకరించాలని ప్రభుత్వం భావించింది. ఈ ప్రాంతంలోని 580 మంది గిరిజన రైతులకు కేవలం ఎకరం, అర ఎకరం భూమి మాత్రమే ఉంది. దీంతో వారంతా పార్మా కంపెనీలకు భూమిని ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు.
ఫార్మా కంపెనీలు ఏర్పాటుతో భవిష్యత్తులో తమకు ఆరోగ్య సమస్యలు వస్తాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల లగచర్లలో రైతులు అధికారులపై దాడి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇదికాస్తా కాంగ్రెస్ సర్కారుపై విమర్శలకు తావిచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ లగచర్లలో ఫార్మా కస్టర్ ఏర్పాటు కోసం గతంలో ఇచ్చిన జీవోను తాజా ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది.