
RGV satirical tweet on Konda Surekha : తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అటు రాజకీయాల్లో, ఇటు సినీ ఇండస్ట్రీలో పెను దుమారాన్ని రేపాయి. రాజకీయాల్లోకి సినీ ప్రముఖల జీవితాలను లాగుతారా అంటూ ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఒక మహిళా మంత్రి.. మరో మహిళపై ఇలా జుగుప్సాకరమైన వాఖ్యలు చేయడం ఏంటంటూ ప్రతి ఒక్కరూ మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా సినీ ఇండ్రస్టీ మొత్తం మంత్రి సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే దీనిపై తెలుగు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించిన తీరుపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతున్నది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆర్జీవీ ఓ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో వెంటనే కలుగజేసుకోవాలని కోరారు. ఇలాంటివి జరగకుండా మంత్రి కొండా సురేఖకు గట్టిగా వార్నింగ్ ఇవ్వాలంటూ ఇండస్ట్రీ తరపునుంచి అడుగుతున్నామని ఆర్జీవీ కోరారు. నాగార్జున కుటుంబాన్ని అత్యంత దారుణంగా అవమానపరిచిన కొండా సురేఖ కామెంట్లకి తాను షాక్ అయ్యానని తెలిపారు. తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికీ ఏ మాత్రం సంబంధలేని నాగార్జున కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగడం ఏ మాత్రం సహించకూడదని స్పష్టం చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యల తర్వాత సినీ పరిశ్రమ అంతా ఒక్కటైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి నుంచి ప్రతి ఒక్కరూ తీవ్రంగా స్పందిస్తున్నారు. సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ సైతం తనదైన శైలిలో భగ్గుమన్నారు.
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై డైరెక్టర్ ఆర్జీవీ మరోసారి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘సురేఖ గన్ తో టార్గెట్ చేసింది కేటీఆర్ ను… కాల్చిందేమో నాగార్జున, నాగచైతన్యను. కానీ క్షమాపణ చెప్పింది మాత్రం సమంతకు. ఐన్‌స్టీన్ కూడా ఈ ఈక్వేషన్‌ను పరిష్కరించలేడేమోనని నాకు డౌట్’ అంటూ తనదైన శైలిలో సెటైరికల్ ట్వీట్ చేశారు వర్మ. కాగా ఆర్జీవీ ఇంతకుముందు సమంతను సురేఖ పొగిడారని ట్వీట్ చేసిన చేసిన విషయం తెలిసిందే.






