Riverfront Projects : భాగ్యనగరంలోని హైదరాబాద్‌లోని మూసీ నదిని సుందరమైన రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికోసం రూ. లక్షన్నర కోట్ల నిధులను ఖర్చుచేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలో ఇప్పటివరకూ ఏ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుకు కూడా ఇంత పెద్దమొత్తంలో నిధులు కేటాయించిన దాఖలాల్లేవు. అలాగే, దేశంలో ఇప్పటివరకూ చేపట్టిన రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులన్నీ వైఫల్యాలుగానే మిగిలిపోయాయి. ఫలితంగా రూ. వేల కోట్ల ప్రజాధనం వృధాఅయిపోయింది. శాస్త్రీయ అధ్యయనం, పర్యావరణ పరిస్థితులను అవగాహన చేసుకోకుండా, సీవరేజ్ ట్రీట్ మెంట్ కార్యాచరణను ముందస్తుగా పూర్తి చేయకుండా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు విజయవంతం కాదు. ఇలాంటి కీలక విషయాలను ఏమాత్రం పట్టించుకోకుండా పేదల ఇండ్లను కూలగొట్టడంతోనే మూసీ అభివృద్ధి జరుగుతుందన్నట్టు వ్యవహరిస్తున్న రేవంత్ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దేశంలో వైఫల్యం చెందిన రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల గురించి తెలుసుకుందాం. నమామీ గంగే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్డ్ వ్యయం రూ.40వేల కోట్లు. ఇది గంగానదిని శుద్ధి చేసేందుకు చేపట్టారు. ప్రధానంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో శుద్ధీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. 2014లో ఈ ప్రాజెక్టుకు శంకు స్థాపన చేశారు. మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్వహణలోపం, మూతబడ్డ పైప్‌లైన్ల ప్రాజెక్టుల కారణంగా ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది. ‘కాలుష్య కాసారంగా ఉన్న గంగా నదిని స్వచ్ఛంగా మారుస్తాం. ఈ నీటిని తాగునీటికి సైతం వినియోగించేలా తీర్చిదిద్దుతాం. దీని కోసం ‘నమామి గంగే’ ప్రాజెక్టును చేపడుతున్నాం’ అంటూ పదేండ్ల కిందట ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టును ప్రకటించారు. ఇప్పటివరకూ రూ. 40 వేల కోట్లు ఖర్చు పెట్టినా… ఆ నది నీరు శుద్ధికాలేదు. గంగా నదిలో 50 శాతం నీరు మురుగేనని ఎన్జీటీ వ్యాఖ్యానించటం నది దుస్థితికి అద్దం పడుతున్నది.
మరో ప్రాజెక్ట్ గంగా యాక్షన్ ప్లాన్. దీనిని గంగా నది నీటిని శుద్ధి చేయడానికి ప్రకటించారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో చేపట్టారు. 1986లో ప్రారంభించి రూ.6,788.78 కోట్లు ఖర్చుపెట్టినా ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది. నిధులు పక్కదారి, కాగితాల్లోనే ప్రాజెక్టుల నిర్మాణం ఉండడంతో ఆ డబ్బులన్నీ నీళ్లపాలయ్యాయి. వ్యవసాయ, మానవ వ్యర్థాలతోపాటు పారిశ్రామిక వ్యర్థాలను కూడా నదిలోకి నేరుగా వదులుతుండటంతో గంగా నది తీవ్రంగా కలుషితం అవుతుంది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు దశాబ్దాల కిందే గుర్తించి శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 1986 జనవరి 14న గంగా యాక్షన్ ప్లాన్ (జీఏపీ) ప్రారంభించారు. 40ఏళ్లుగా గంగానదిని శుద్ధిచేస్తున్నా ఇప్పటికీ అది మురుగు కాలువలాగే ఉన్నదని సాక్షాత్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆందోళన వ్యక్తంచేసింది.
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో సుమారు 1000కోట్లతో చేపట్టిన బిలాస్‌పూర్ రివర్ ఫ్రంట్ పరిస్థితి కూడా అంతే. బిలాస్‌పూర్‌లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. నగరంలో ప్రవహిస్తున్న అర్పా నదిని శుద్ధి చేయడమే లక్ష్యంగా దీన్ని ప్రారంభించారు. తద్వారా నగర ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చవచ్చని లక్ష్యంగా పెట్టుకొన్నారు. అయితే, ప్రాజెక్టు ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే ఈ పనులు అటకెక్కాయి. ప్రాజెక్టుకు కేటాయించిన రూ. 1000 నిధులు ఏమయ్యాయో కాగితాల్లో కూడా కనిపించట్లేదు.
అలాగే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రవహిస్తున్న సబర్మతీ నదిని శుద్ధి చేసే ఉద్దేశంతో 2005లో ‘సబర్మతీ యాక్షన్ ప్లాన్’ పేరిట ఈ ప్రాజెక్టును తీసుకొచ్చారు. మోదీ మానస పుత్రికగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకూ రెండు దఫాల్లో రూ. 1,400 కోట్లు ఖర్చు పెట్టారు. అయితే, నదిలో నీటిని మాత్రం శుద్ధి చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. నిజానికి 1961లోనే సబర్మతీ నదిని శుద్ధి చేయాలన్న ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇక, సబర్మతీ రీ-డెవలప్‌మెంట్ ప్రాజెక్టు పేరిట తీసుకొచ్చిన ఈ పనులతో జాతిపిత మహాత్మాగాంధీ నివసించిన ‘సబర్మతీ ఆశ్రమం’ కూడా ధ్వంసమైనట్టు హక్కుల కార్యకర్తలు విమర్శిస్తున్నారు. మరో ప్రాజెక్టు రాజస్థాన్‌లో ప్రవహిస్తున్న ద్రవ్యావతి నది పునరుజ్జీవనం కోసం 2015లో అప్పటి ప్రభుత్వం రూ. 1,676 కోట్లతో ‘ద్రవ్యావతి రివర్ ప్రాజెక్టు’ను ప్రారంభించింది. 47.7 కిలోమీటర్ల పొడువులో కలుషిత నీటిని శుద్ధి చేసి స్వచ్ఛమైన నీటిగా మార్చడం వంటి పనులను లక్ష్యంగా పెట్టుకొన్నది. రోజుకు 170 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేయడానికి జైపూర్ డెవలప్‌మెంట్ అథారిటీ లక్ష్యంగా నిర్ణయించింది. ప్రాజెక్టులో భాగంగా నది ఒడ్డున మొక్కల పెంపకం, కొత్త నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. 2018నాటికి పూర్తికావాల్సిన ఈ ప్రాజెక్టు సరైన దిశానిర్దేశం లేకపోవడంతో మధ్యలోనే ఆగిపోయింది. రూ. 1,676 కోట్లు వృదా అయ్యాయి.
మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో ప్రవహించే నర్మదా నది పరిరక్షణ, నీటి శుద్ధి, నదిపై పెద్ద ఆనకట్టల నిర్మాణం కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘నర్మదా యాక్షన్ ప్లాన్’ను ప్రతిపాదించింది. పారిశ్రామిక వ్యర్థాలు నదిలోకి చేరకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, రూ. 15,000 కోట్లు (డ్యామ్‌ల నిర్మాణ వ్యయంతో కలిపి). అయినా నదిలోకి వ్యర్థాలు చేరకుండా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సుందరీకరణ పనులు నిలిచిపోయాయి. ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం తమ భూములను అక్రమంగా లాక్కుంటుందని, అడవులను ధ్వంసం చేస్తోందని ఆరోపిస్తూ గిరిజనులు, రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘నర్మదా బచావో ఆందోళన’ నిర్వహించారు. మూడు వేల కోట్లతో ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ఏర్పాటు చేశారు. అయితే, విగ్రహం ప్రారంభ రోజుల్లో ఆసక్తి చూపిన పర్యాటకులు తర్వాత తగ్గిపోయారని నివేదికలు వెలువడ్డాయి.