AP Volunteers : రెండో సారి అధికారంలోకి రావాలని జగన్ కలలు కంటున్నారు. దీని కోసం అధికారాన్ని ఎంతగా దుర్వినియోగం చేయాలో అంతగా చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘సిద్ధం’ చివరి సభకు జనసమీకరణ కోసం వలంటీర్ల వ్యవస్థను వైసీపీ యథేచ్ఛగా వాడుకున్నది. ఆదివారం బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద జరిగిన సభకు వలంటీర్లే దగ్గరుండి ప్రజలను తోలుకొచ్చారు.
చాలా మంది వలంటీర్లు వారి పరిధిలోని ఇండ్లకు వెళ్లి కుటుంబ సభ్యుల్లో ఒకరు కచ్చితంగా సిద్ధం సభకు రావాల్సిందేనని హుకుం జారీ చేశారు. ఇంటికి రూ.500 చొప్పున ఇచ్చినట్టు పలు గ్రామాల వాసులు చెప్పారు. సభకు రాకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తారనే భయంతో వచ్చినట్టు పలువురు ఆవేదన చెందారు. ఈ సందర్భంగా ఓ వృద్ధుడు మాట్లాడుతూ.. తన ఇద్దరు పిల్లలు గుంటూరులో ప్రైవేట్ జాబులు చేసుకుంటున్నారని, తన భార్యకు అనారోగ్యమని, వారు వచ్చే అవకాశం లేకపోవడంతో తానే అతికష్టం మీద వచ్చినట్టు చెప్పారు.
దీన్ని బట్టి సిద్ధం సభకు జనసమీకరణకు వైసీపీ ఎలా ఒత్తిడి తెచ్చిందో తెలుస్తోంది. సభకు హాజరయ్యే వారికి బస్సులో భోజన ప్యాకెట్, మద్యం సీసా ఇచ్చారు. సభా ప్రాంగణంలో ఎక్కడ పడితే అక్కడ మద్యం తాగి చిందులేయడం కనిపించింది. కొందరికి మత్తు ఎక్కువై అక్కడే పడిపోయారు. మందుబాబుల చేష్టలతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సిద్ధం పేరుతో వైసీపీ చేసిన ఆగడాలపై సోషల్ మీడియాలో సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. సభ సక్సెస్ అయ్యిందని చెప్పించుకోవడానికి వైసీపీ నానా పాట్లు పడుతోందని ఎద్దేవా చేశారు. భయపెట్టి ప్రజలను సభకు తీసుకురావొచ్చు గానీ ఈవీఎం మీటను నొక్కించగలరా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.