ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు. మునుగోడులో జరిగిన ఎన్నికల్లో పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టగా 4000 ఓట్లు దక్కించుకున్నారు. అయితే ఆయనకు దళిత సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నది. ఈ క్రమంలో తాజాగా ఆయన తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని ప్రకటించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గం ఎంచుకున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు
సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని, భూకబ్జాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు ఈ నేపథ్యంలో తాను సిర్పూర్ నుంచి పోటీ చేయాలనుకున్నట్లు తెలిపారు. అయితే ఎమ్మెల్యే కోనప్ప కూడా గతంలో బీఎస్పీ నుంచి ఇదే నియోజకవర్గం నుంచి గెలిచారు. ఇక్కడ దళిత, బహుజనుల ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. సమర్ధుడైన అధికారిగా ఆయనకు పేరు ఉంది. ప్రజల్లో కూడా మంచి గుర్తింపు ఉంది.