Sacrifices Jana Sena-TDP : జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రతో పొలిటికల్ రూట్ లో జోరు పెంచారు. అధికార పార్టీని ఇరుకున పెట్టడానికి అన్ని అస్ర్తాలు సంధిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి ధీటుగా ప్రజాక్షేత్రంలో ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో గతానికి భిన్నంగా పూర్తి రాజకీయ పంథాలో ముందుకు సాగుతున్నారు. పవన్ తీరు చూసి రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే ముందుకెళ్తారని అంతా భావించారు. కానీ చంద్రబాబు అరెస్టుతో ఏపీలోరాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.
రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో పవన్ కల్యాణ్ ములాఖాత్ కావడం, ఆ తర్వాత వెంటనే టీడీపీతోనే ముందుకు సాగుతామని ప్రకటించడం ఆశ్చర్యానికి గురి చేసింది.దీంతో రెండు పార్టీల్లోనూ ఉత్సాహం రెట్టింపైంది . కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. అదే సీట్ల సర్దుబాబు. టీడీపీ, జనసేన గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే జనసేన కన్నా టీడీపీ పరిస్తితి కాస్త మెరుగ్గా ఉంది. రెండు పార్టీలు తన పార్టీ శ్రేణులను సమన్వం చేసుకుంటేనే పొత్తు ఫలిస్తుంది. లేదంటే రెండు పార్టీల్లోనూ అసంతృప్తులు రెబల్ గా పోటీ చేయడం లేదా, అధికార పార్టీలోకి వెళ్లడమే జరుగుతుంది. ఇదే జరిగితే పొత్తు ఫలితాలకు బ్రేక్ పడినట్లే.
తొలి ఫైట్ ఇక్కడి నుంచే..
పొత్తులో భాగంగా తొలి పోరు తెనాలి నుంచే ప్రారంభమైనట్లు సమాచారం. జనసేనకు అత్యంత కీలకమైన నేత నాదెండ్ల మనోహర్ 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన నియోజకవర్గం తెనాలి. తెలుగుదేశం పార్టీ నుంచి ఆలపాటి రాజా ఇదే నియోజవకవర్గంపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తున్నది. అయితే గత ఎన్నికల్లో ఇరు పార్టీల ఓట్ల చీలిక వైసీపీ గెలుపునకు మార్గం చూపినట్లయ్యింది.
పొత్తులో భాగంగా టీడీపీ కి మంచి పట్టున్న గుంటూరు వెస్ట్ కు నాదెండ్లను పోటీకి నిలిపి తెనాలి సీటు ఆలపాటి రాజాకు ఇస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. టీడీపీ అంతర్గత సర్వేలు రాజా కు అనుకూలంగా ఉన్నట్లు సమాచారం .అయితే ఎవరు ఎక్కడ పోటీ చేసిన వారిని తమ ఉమ్మడి అభ్యర్థిగా భావించి శత్రువును ఓడించమే లక్ష్యంగా పని చేస్తే రాష్ట్రంలో తమ తమ జెండాలను ఎగురవేయొచ్చు. రెండు పార్టీలు బెట్టు వీడకకుండా ముందుకెళితే 2019 పునరావృతమవుతుంది.