Bandi Sanjay :
కర్ణాటకలో ఓటమితో బీజేపీ హైకమాండ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ క్షేత్ర స్థాయి కార్యకర్తలను విస్మయానికి గురి చేస్తున్నాయి. ఒక్కసారిగా నాలుగు రాష్ర్టాల్లో బీజేపీ అధ్యక్షులను మార్చేసింది. కానీ ఇందులో తెలంగాణ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడి మార్పు తీవ్ర చర్చనీయాంశమవుతున్నది. బండి సంజయ్ రాష్ర్ట అధ్యక్షుడయ్యాక తెలంగాణ లో పార్టీకి ఊపు తీసుకువచ్చాడు. అధికార పార్టీకి సవాల్ విసిరాడు. క్షేత్ర స్థాయిలో కార్యకర్తల్లో ధైర్యం నింపాడు. కానీ పార్టీ లోని నాయకుల మధ్య అంతర్యుద్ధం రాష్ర్ట అధ్యక్షుడి మార్పునకు కారణమైంది. దీనిని కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.
కిషన్ రెడ్డిని మళ్లీ నియమించడం బీజేపీ హైకమాండ్ చేసిన పొరపాటు చేసిందని అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచీ వ్యక్తమవుతున్నది. బండి స్థాయిలో కిషన్ రెడ్డి దూకుడుగా వ్యవహరించడని కార్యకర్తలు భావిస్తున్నారు.
ఇప్పటి వరకు బీజేపీ చూపించిన దూకుడును కాంగ్రెస్ భర్తీ చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ అనుబంధ విపక్షాల కూటమికి దూరంగా ఉంటున్న కేసీఆర్ దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. తెలంగాణలోనూ బీఆర్ఎస్ తోనూ ఎలాంటి పొత్తు ఉండదని, ఆ పార్టీతో యుద్ధమేనని ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ ప్రకటించాడు. దీంతో ఆ రెండు పార్టీల మధ్య యుద్దం తప్పవని స్పష్టమైంది. ఇక బీజేపీ మంచి నాయకుడిని పక్కన పెట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. కవిత అరెస్టు లేకపోవడం, కేసీఆర్ బీజేపీపై విమర్శలు చేయకపోవడం వంటి అంశాలను కాంగ్రెస్ హైలెట్ చేస్తూ ఆ రెండు పార్టీలు ఒకటేనని ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం బీజేపీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేలా కనిపిస్తున్నది. గతంలో వచ్చిన నాలుగు ఎంపీ సీట్లను రానున్న ఎన్నికల్లో నిలబెట్టుకుంటుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేంద్ర, రాష్ర్ట అధికార పార్టీల మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందాలను కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు సిద్ధమైంది. తమ వ్యూహాలకు మరింత పదును పెట్టింది. బండి సంజయ్ మార్పును కాంగ్రెస్ ప్రధానాంశంగా లేవనెత్తే సూచనలు కనిపిస్తున్నాయి.
బీఆర్ఎస్‌కి మేలు చేసేందుకే బండి సంజయ్‌ని మార్చేశారని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ప్రచారం మొదలెట్టారు. ప్రభుత్వ వ్యతిరేకతను తమ వైపు మళ్లించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇదే అదనుగా బీజేపీలోని సీనియర్ నేతలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించేందుకు హస్తం నేతలు పావులు కదుపుతున్నారు. కేసీఆర్ ను వ్యతిరేకించి బీజేపీ లో చేరిన నేతలతో ఇప్పటికే రాయబారాలు సాగిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డితో పాటు మాజీ మంత్రి ఈటల రాజేందర్ నూ లాగేందుకు కాంగ్రెస్ లాబీయింగ్ చేస్తున్నది. వచ్చిన వారు బయటకు వెళ్లిపోతే తెలంగాణలో బీజేపీ పూర్తిగా బలహీనమయ్యేలా చేసేందుకు కాంగ్రెస్ వ్యూహంగా తెలుస్తున్నది. బీజేపీ అధ్యక్షుడు మార్పు తథ్యం అంటూ కొద్ది రోజులుగా వస్తున్న ప్రచారంతో పార్టీ క్యాడరంతా అయోమయానికి గురైంది. ఆ ప్రచారమే నిజం కావడంతో బీజేపీ క్యాడర్ నీరుగారిపోతున్నది. బీజేపీ క్యాడర్‌ను ఆకర్షించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం బీజేపీలోని చాలా మంది నేతలు, కార్యకర్తలు కూడా.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు లేవని చెబతున్నారు. అధికార పార్టీని ఢీకొట్టేది కాంగ్రెస్ మాత్రమేననే భావన వ్యక్తమవుతున్నది.
ఖమ్మం బహిరంగ సభ తో జోష్ మీదున్న కాంగ్రెస్ కు బండి సంజయ్ మార్పు హస్తం పార్టీకి బూస్ట్ గా మారింది. రాష్ర్టంలో ఇప్పుడు ద్విముఖ పోరు మాత్రమే కనిపిస్తున్నది. బీఆర్ఎస్-బీజేపీ ఒకటే అనే నినాదాన్ని ఎంత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తే.. అంతగా తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ ప్రచారాన్ని మరోసారి అధ్యక్ష బాధ్యతలు ఎత్తుకున్న కిషన్ రెడ్డి ఎలా తిప్పి కొడతారో వేచి చూడాల్సిందే.