AP Anganwadis Strike : తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని 22 రోజులుగా ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. సమస్యలు పరిష్కరించే వరకు నిరసన ఆపేది లేదని ప్రభుత్వానికి వారు ఇప్పటికే తేల్చిచెప్పారు. ఈ క్రమంలో జగన్ సర్కార్ వారికి నోటీసులు జారీ చేసింది.
జనవరి 5వ తేదీలోగా విధులకు హాజరు కావాలని.. లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు కలెక్టర్ల ద్వారా ‘ప్రభుత్వ విజ్ఞప్తి’ పేరుతో అంగన్వాడీలకు నోటీసులు జారీ చేయించింది. అంగన్వాడీల సమ్మె కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులు, వారికి ఇప్పటికే పూర్తిచేసిన హామీలను వివరిస్తూ ప్రభుత్వం నోట్ జారీ చేసింది.
కాగా, అంగన్వాడీ కార్యకర్తలు గత 22 రోజులుగా తమ వేతనాల పెంపు, గ్రాట్యుటీ సహ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సమ్మె చేస్తున్నారు. మిగతా హామీలకు ఒప్పుకున్న ప్రభుత్వం వేతనాల పెంపునకు ససేమిరా అంటోంది. ఈ విషయంపై అంగన్వాడీలు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.10 లక్షల మంది కార్యకర్తలు సమ్మెలో ఉంటే.. సీఎం జగన్ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. ఎన్నికల్లో ఓట్ల కోసం హామీలు ఇచ్చింది మీరు కాదా? మీ మాటలను నమ్మి ఓటు వేస్తే.. ఇలా అన్యాయం చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చర్చలు అంటూనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారని, ప్రభుత్వం తీరు ఇలాగే కొనసాగితే తాము కూడా వచ్చే ఎన్నికల్లో ప్రత్యామ్నాయం చూసుకుంటామని హెచ్చరిస్తున్నారు. తమకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పడం అబద్ధమని వారు అంటున్నారు. అంగన్ వాడీ కేంద్రాలకు రెంట్లు, ఫోన్లు తమ కోసం ఇచ్చారా? అని ప్రశ్నిస్తున్నారు. ఫోన్లతో తమకు పనిభారం మరింత పెరిగిందని వాపోతున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో వేతనాలు పెంచారని, గ్రాట్యూటీ కూడా చాలా రాష్ట్రాల్లో అమలవుతోందని, తమపై ప్రభుత్వ వైఖరితో తాము తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నామని ఆవేదన చెందుతున్నారు.
తాజాగా మళ్లీ 5వ తేదీలోగా విధుల్లోకి రాకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారని వాపోతున్నారు. మరో మూడు నెలల్లో ఎన్నికలు ఉండగా జగన్ సర్కార్ ఇంత కఠినంగా ఉందని.. ఆ ఎన్నికల్లో అంగన్వాడీల పవర్ ఏంటో చూపిస్తామని అంటున్నారు.