Satires On Kejriwal :
ఢిల్లీ సీఎం కేజ్రివాల్ ప్రధాని నరేంద్ర మోదీ తీరును వ్యతిరేకిస్తూ ముందునుంచి పోరాడుతున్నారు. ఆయన ప్రస్తుతం ప్రతిపక్ష ఇండియా కూటమిలో చేరారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన పోరాడుతున్నారు. అయితే ఢిల్లీలో సర్వాధికారాలు రాష్ర్ట ప్రభుత్వానికే ఉంటాయనే న్యాయస్థానం తీర్పును కూడా కేంద్రం సవాల్ గా తీసుకుంది. ఏకంగా చట్ట సవరణకే సిద్ధమైంది.
అయితే ఇక ఢిల్లీ సీఎం కేజ్రివాల్ పై బీజేపీ క్యాంపు నుంచి సెటైర్లు పడుతున్నాయి. చాయ్ వాలా అంటూ ట్రోల్ చేస్తున్న ప్రధాని మోదీ దేశంలో ఐఐటీ, ఎయిమ్స్ లాంటి సంస్థలు తెరుస్తుంటే, ఇటు ఐఐటీ చదివిన ఢిల్లీ సీఎం కేజ్రివాల్ లిక్కర్ బిజినెస్ చేస్తున్నారంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇటీవల లిక్కర్ స్కాం కేసులో కేజ్రివాల్ పేరు ప్రముఖంగా వినపడుతున్నది. ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఈ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగానే ఈ లిక్కర్ దందా జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వివాదమంతా కేజ్రీవాల్ వైపు తిరిగింది.
ఇక ఈ కేసు రెండు తెలుగు రాష్ర్టాలను అంటుకున్నది. ఏపీ, తెలంగాణ లో కీలక నేతలకు దీనితో సంబంధం ఉన్నట్లు తేలింది. ఏకంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే ఈడీ ఆమెను పలుమార్లు విచారించింది. మరోసారి తాజాగా విచారణకు పిలిచింది. ఇప్పటిలో ఈ కేసు తేలేలా లేదు. అయితే ఈ లిక్కర్ కేసు గురించి మాత్రం సోషల్ మీడియాలో పోస్టులు పేలుతున్నాయి. లిక్కర్ కేసులో కేజ్రివాల్ ప్రధాన పాత్ర ఉందంటూ, ఢిల్లీలో లిక్కర్ దందా చేస్తున్నాడంటూ కేజ్రివాల్ నుంచి బీజేపీ శిబిరం నుంచి సెటైర్లు వేస్తున్నారు.