Telangana BJP :
మూడు నెలల క్రితం తెలంగాణలో బీజేపీ ఎంతో దూకుడుగా కనిపించింది. ఇక అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అనుకునేలాగా పరిస్థితి మారిపోయింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకం తర్వాత రాష్ర్టంలో ఆ పార్టీ మంచి దూకుడు మీద కనిపించింది. ఏం జరిగిందో తెలియదు కానీ పార్టీ ఒక్కసారిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయింది. జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణలో తన కార్యచరణను పక్కన పెట్టేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు అధ్యక్షుడి మార్పు మరింత సంచలనమైంది. బండి సంజయ్ ని పక్కన పెట్టి తెలంగాణ సీఎం తో సత్సంబంధాలు ఉన్న కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా ప్రకటించడంతో, కార్యకర్తలంతా అయోమయంలో పడ్డారు. ఏం జరుగుతున్నదో తెలియక కొంత సందిగ్ధంలో పడ్డారు.
అయితే కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత తెలంగాణలో ఒక్కసారిగా ఊపు మీదకు వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ కు పడే ఓట్లను చీల్చితే అది కాంగ్రెస్ కు లాభం చేస్తుంది. ఈ నేపథ్యంలో జాతీయ నాయకత్వం బీఆర్ఎస్ కు సహకరించాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతున్నది. అయితే ఇక్కడే ఆ పార్టీ నేతలకు అసలు సమస్య వచ్చి పడింది. బీఆర్ఎస్ తో సఖ్యత నచ్చని నేతలంతా ఇప్పుడు వేరు కుంపటిలోకి వెళ్లారు. మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, విజయశాంతి, రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, సీనియర్ నేతలు గరికపాటి రామ్మోహన్ రావు, చాడ సురేశ్ రెడ్డి హైదరాబాద్ లో రహస్యంగా భేటీ అయ్యారు.
మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో వీరంతా సమావేశమైనట్లుగా సమాచారం. కాగా, ఇఫ్పటికే వీరంతా కాంగ్రెస్ లోకి వెళ్తారనే ప్రచారం జరుగుతున్నది. ఈ విషయమై కార్యాచరణ రూపొందించేందుకే వీరంతా సమావేశమైనట్లుగా తెలుస్తున్నది. ఇప్పటికే బీజేపీలో కీలక నేతగా ఉన్న విజయశాంతి తనకు సోనియా అంటే గౌరవం అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం బీజేపీలో పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో వీరంతా కాంగ్రెస్ గూటికి వెళ్లాలనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ విషయమై ఇప్పటికే ఆ పార్టీ నేత వివేక్ కాంగ్రెస్ హైకమాండ్ తో మాట్లాడినట్లుగా కూడా ప్రచారం జరుగుతున్నది. మరి ఈ రహస్య భేటీల విషయంలో బీజేపీ అధిష్టానం అప్రమత్తమవుతుందా.. ? భేటీలో పాల్గొన్న లీడర్లతో మాట్లాడుతుందా.. ? వేచి చూడాల్సి ఉంది. మరోవైపు పార్టీ చేరికల కమిటీ కన్వీనర్ గా ఉన్న ఈటల రాజేందర్ కూడా కొంత కాలంగా సైలెంట్ గా ఉంటున్నారు. మరి ఆయన నిర్ణయం కూడా ఇప్పుడు కీలకంగా మారబోతున్నది. ఏదేమైనా బీజేపీలో ఉంటే తాము కూడా బీఆర్ఎస్ దోస్తీలమనే టాక్ వస్తుందని, అందుకే గోడ దూకేయాలని భావిస్తున్నట్లు మాత్రం టాక్ వినిపిస్తున్నది.