
మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఏదో ఒక చోట ఆడవారు కామాంధుల అఘాయిత్యాలకు బలవుతున్న సంఘటనలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. కామాంధులు వావి వరసలు మరుస్తున్నారు. పశువుల్లా ప్రవర్తిస్తూ తమ కామ వాంఛకు ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. బ్లాక్ మెయిల్ చేస్తూ ఒకడు, బెదిరించి మరొకడు, స్నేహం పేరిట ఇంకొకడు, ప్రేమ, పెళ్లి.. పేరిట తమ కామవాంఛనలు తీర్చుకునేందుకు అడ్డదారులన్నింటినీ వాడుకుంటున్నారు. అయితే ఇందులో ఎక్కువగా బంధువులు, తెలిసిన వారు, స్నేహితుల ముసుగు తొడిగిన వారే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. కరీంనగర్ జిల్లాలోనూ ఇలాంటి ఓ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఓ బాలిక తన ప్రియుడితో సన్నిహితంగా ఉన్నప్పుడు అతడి స్నేహితులు రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీశారు. వాటిని చూపి బెదిరించి పలుమార్లు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మరో ముగ్గురు స్నేహితులూ ఆమెను లొంగదీసుకునేందుకు ప్రయత్నించడంతో బాధితురాలు మొదట షీ-టీమ్‌ను ఆశ్రయించింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది.
కరీంనగర్ పట్టణంలోని ఓ కాలనీకి చెందిన బాలిక పదో తరగతి చదువుతున్నది. అదే కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే ఏడాది క్రితం ఓ సందర్భంలో ప్రేమికులిద్దరూ సన్నిహితంగా ఉండగా బాలుడి ఫ్రెండ్స్ రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీశారు. వాటిని ఆమె కుటుంబసభ్యులకు చూపిస్తామంటూ బెదిరించి.. బాలికను లొంగదీసుకున్నారు. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ వీడియోలను తమ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చేశారు. వారి స్నేహితులు ముగ్గురు కూడా ఆ వీడియోలను బాధిత బాలికకు చూపెట్టి తమతో గడపాలని బెదిరింపులకు గురిచేశారు. దీంతో ఆ బాలిక మూడు రోజుల క్రితం షీ-టీమ్‌ను ఆశ్రయించింది. షీ-టీమ్ పోలీసులు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసినట్లు సమాచారం. అయితే.. సోమవారం బాధిత బాలిక తల్లిదండ్రులతో కలిసి కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. బాలిక ప్రియుడు సహా ఆరుగురిపై పోలీసులు అత్యాచారం, బెదిరింపులు, పోక్సో కేసు నమోదు చేశారు. ఇందులో ఒకరు మేజర్ కాగా.. ఐదుగురు మైనర్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఐదుగురు ఇంటర్ చదువుతున్నారు. యువకుడు మాత్రం పాలిటెక్నిక్ పూర్తి చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని.. బాలికను వైద్య పరీక్షలకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు.