- కైతలాపూర్ లో శక పురుషుడి జయంతి ఉత్సవాలు

Shaka Purush : తెలుగు సినిమా అగ్రనటుడు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లి పరిధిలోని కైతలాపూర్ గ్రౌండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ‘ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్‌సైట్ కమిటీ’ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఎన్టీఆర్ కుటంబసభ్యులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు స్టార్లు రాబోతున్నారు.
ఇందులో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ , సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా , సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటు పలువురు రాజకీయ నేతలు రానున్నారు. అలాగే సినీ పరిశ్రమ నుంచి పవర్ స్టార్ పవన్ కల్యాణ్, కన్నడ హీరో శివరాజ్ కుమార్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, కల్యాణ్ రామ్, సిద్దు జొన్నలగడ్డ వంటి వారంతా రాబోతున్నట్లు సమాచారం. వీరంతా ఒకే వేదిక కనిపిస్తే అభిమానులకు కనుల పండువ కానుంది.
అయితే ఈ వేడుకను రాజకీయాలకు సంబంధం లేకుండా నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ కార్యక్రమంలో సావనీర్, వెబ్‌సైట్‌ల ఆవిష్కరణలతోపాట పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పలువురు ప్రముఖులకు నిర్వహణ కమిటీ పురస్కారాలు అందించనుంది. ఎన్టీఆర్ సమగ్ర జీవితానికి సంబంధించిన విశేషాలు, పూర్తి సమాచారంతో రూపొందించిన ‘జై ఎన్టీఆర్’ వెబ్‌సైట్ ఆవిష్కరించనున్నారు.
టీడీ జనార్ధన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలకు .. ఆయనే స్వయంగా అందరి ఇళ్లకు వెళ్లి అతిథులను ఆహ్వానించారు. వారంతా రావడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నది. అందుకే వారి పేరున హైదరాబాద్‌లో స్వాగతాలు కూడా ఏర్పాటు చేశారని అంటున్నారు. ప్రకటనల్లో పేర్కొన్నట్లుగా హీరోలు అందరూ ముఖ్యంగా పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ అందరూ ఒకే వేదికపై కనిపిస్తే.. సినీ ఫ్యాన్స్ కు అంతకంటే కన్నుల పండువ మరోటి ఉండదు. అందుకే ఈ వేడుకపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ దూరం..
ఈ వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ వస్తారనే ప్రచారం జరిగింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ కారణంగా ఈ సభకు రాలేక పోతున్నట్లు తెలిసింది. మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ రోజు తన కుటుంబ సభ్యులతో గడపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ కారణంగా జూనియర్ వార్షికోత్సవ వేడుకలకు హాజరుకావడం లేదని తెలిపారు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్ శతజయంతి కమిటీకి కూడా చెప్పినట్లు జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు.