
Shankaramma : తెలంగాణ తుది దశ ఉద్యమంలో అమరుల పాత్ర మరువలేనిది. వారి ఆత్మబలిదానాల కారణంగా కూడా ప్రత్యేక రాష్ర్టం కల సిద్ధించింది. రాష్ర్టం సిద్ధించాక వారి కలల సాకారం దిశగా అడుగులు పడాలని ప్రతి కుటుంబం కోరుకుంది. అయితే కొన్నాళ్లుగా ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. అమరుల కుటుంబాలకు సరైన గౌరవం దక్కలేదని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విమర్శలను ఎప్పటికప్పుడూ సీఎం కేసీఆర్ తిప్పకొడుతూనే ఉన్నారు. ఇప్పటికే అమరుల కుటుంబాలకు ఆయన రూ. 10 లక్షల సాయం చొప్పున అందజేశారు. దీంతో పాటు అమరుల స్మారక చిహ్నాన్ని హైదరాబాద్ లో అతిపెద్దగా ఏర్పాటు చేయించారు. ఇప్పుడు రాష్ర్ట ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అమరుల ను గుర్తు చేసుకుంటూ గురువారం ప్రత్యేక దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఇదంతా జరుగుతున్న ఎక్కడో వెలితి ఉంది. అందుకే సీఎం కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది.
అమరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఎమ్మెల్సీ ఇవ్వాలని ఆయన నిర్ణయించారట. ఇప్పటికే ఒక సారి ఆమెకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశమిచ్చారు. కానీ ఆమె ఓడిపోయింది. అయితే ఇప్పుడు ఆమెకు కేసీఆర్ తీపి కబురు అందించబోతున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. సాధారణంగా అవి ఖాళీ అయ్యే నాటికి భర్తీ చేస్తారు. కానీ ఈసారి సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గవర్నర్ కు ఎలాంటి సిఫార్సులు పంపలేదు.
గతంలో హుజూర్ నగర్ నుంచి శాసనసభకు పోటీ చేసిన శంకరమ్మ ఓడిపోయారు. ఆ తర్వాత అదే స్థానానికి ఉపఎన్నిక జరిగినప్పుడు.. టిక్కెట్ కోసం పోటీ పడ్డారు. కానీ ఆమెకు ఎమ్మెల్సీ గా అవకాశమిస్తామని హైకమాండ్ చెప్పింది. ఉప ఎన్నికల్లో సైదిరెడ్డి ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి శంకరమ్మ ఎమ్మెల్సీ పదవి కోసం చూస్తున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజును.. అమర వీరులకు కేటాయించారు. గురువారం అమరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించబోతున్నారు. ఈ సభలోనే శంకరమ్మను ఎమ్మెల్సీగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కొంతకాంగా ఆరోపణలు వస్తున్నాయి . వీటిని తిప్పికొట్టేందుకే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయానికి వచ్చారని అంతా అనుకుంటున్నారు. మరో వైపు బీఆర్ఎస్ లో చాలా మంది సీనియర్లు.. ఎమ్మెల్సీ టిక్కెట్ కోసం చూస్తున్నారు. అయితే ఒక సీటు అనూహ్యంగా శంకరమ్మకు కేటాయించడంతో ఇక వారి ఆశలు గల్లంతయ్యాయి. మరోవైపు రాజకీయంగా ఉద్యమకారుల కుటుంబాలకు అండగా నిలిచారనే అంశం కూడా తెరపైకి వస్తుంది. అయితే శంకరమ్మకు ఇప్పటికే ఒక పీఏ, గన్ మెన్ ను అందుబాటులో ఉంచాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించినట్లుగా తెలుస్తున్నది. దీంతో ఇక శంకరమ్మ ఎమ్మెల్సీగా పదవిలోకి రావడం ఖాయంగా కనిపిస్తున్నది.






