-నష్టమే తప్ప లాభం లేదంటున్న నేతలు
YS Sharmila : వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడం లేదా పార్టీని విలీనం చేయడం లేదా అనే అంశంపై కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతున్నది. దీనిపై ఎటువంటి క్లారిటీ రాకున్నా.. షర్మిల మాత్రం కాంగ్రెస్ తో ముందుకు సాగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే షర్మిల చేరికను కాంగ్రెస్ లోని ఓ వర్గం అడ్డుకుంటున్నట్లు తెలుస్తున్నది.
కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి షర్మిలను తమ పార్టీలోకి రావాలని కోరుతున్నామని చెప్పడం ఆమె కాంగ్రెస్ వెంట నడిచేందుకు సిద్ధమైనట్లు అవగతమవుతున్నది. అయితే షర్మిల చేరికను కాంగ్రెస్‌లోని మెజారిటీ నేతలు వ్యతిరేకిస్తున్నారు.
గత కొంత కాలంగా ఈ అంశంపై పార్టీలో తీవ్ర చర్చ జరగుతున్నది. రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతతో ఆమె ఫోన్ చేసి మాట్లాడడం ఆ పార్టీలో చిచ్చు రేపింది. షర్మిల కాంగ్రెస్ నేతలతో చర్చలు జరుపుతూ పార్టీ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఏఐసీసీ అగ్రనాయకత్వంతోనూ ఆమె టచ్‌లో ఉంటున్నారు.
కర్ణాటక పీసీసీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో షర్మిల సమావేశమై చేసిన ప్రతిపాదనపై చర్చించేందుకు ఏఐసీసీ నేతలు కూడా ఆమెను ఢిల్లీకి పిలిచారు. ప్రియాంక గాంధీ ప్రధాన బృందం డీకే శివకుమార్‌తో పార్టీ విలీన ప్రణాళిక, పార్టీ పరంగా కల్పించాల్సిన బాధ్యతలపై చర్చించినట్లు సమాచారం.
ఆంధ్ర ‘ట్యాగ్’
షర్మిలను పార్టీలోకి ఆహ్వానించే ముందు పునరాలోచించుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధిష్టానాన్ని కోరారు. ఆంధ్రా ట్యాగ్ ఉన్న షర్మిల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారని సమాచారం. ఏపీలో కాంగ్రెస్ బలపడాలంటే షర్మిలను అక్కడికి పంపిస్తే పార్టీకి ప్రయోజనం ఉంటుందని నేతలు సూచిస్తున్నారు. అయితే ఇందుకు షర్మిల సమ్మతించడం లేదని తెలుస్తున్నది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్‌కు తెలియజేసినట్లు సమాచారం. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఓ మాజీ ఎంపీ కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్‌టీపీ విలీనానికి సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. విలీనం తప్పదనే ప్రచారంతో రేవంత్‌రెడ్డి శిబిరం ఆందోళన చెందుతున్నది. ఆమె పార్టీలో చేరితే పార్టీలో మరో పవర్ సెంటర్‌గా మారుతుందని రేవంత్‌రెడ్డి వర్గం నేతలు చెబుతున్నారు. షర్మిల కాంగ్రెస్‌లోక చేరిత 2018 ఎన్నికలు రిపీట్ అవుతాయంటున్నారు.
షర్మిల ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వారని, పార్టీకి సేవ చేయాలనుకుంటే అక్కడికి వెళితే బాగుంటుందని, అయితే తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వంలో పనిచేసే అవకాశం లేదని గతంలో రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్‌లో స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్‌టీపీని విలీనం చేసి తన అభ్యర్థులకు రెండు, మూడు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని, తెలంగాణ ఎన్నికల తర్వాత ఏపీకి వెళ్లి అక్కడ పార్టీ బాధ్యతలు చేపట్టాలని పార్టీ అధిష్టానం సూచిస్తున్నట్లు తెలుస్తున్నది. పార్టీ విలీనం, పొత్తుమాటేమిటో గానీ షర్మిల మాత్రం కాంగ్రెస్ లో అలజడిని సృష్టిస్తున్నది.