Chandrababu Graph : ఏపీలో ఒక్క చాన్స్ అంటూ అధికారంలో కి వచ్చిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాష్ర్టంలో మరే పార్టీ రాజకీయాలు చేయకూడదు అన్నట్లుగానే ఆది నుంచి ప్రవర్తిస్తున్నారు. ప్రతిపక్షాలు లేకుండా చేసుకోవాలనే తలంపుతోనే ఆయన పాలన సాగిస్తు్న్నారు. మొదటి నుంచి ప్రతిపక్ష నేతలపై కేసులు, దాడులు, హింస ఇవన్నీ ఆయన మనస్తత్వాన్ని చెప్పకనే చెబుతున్నాయి. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరిట రాజన్న రాజ్యం అంటూ అధికారంలోకి వచ్చిన ఆయన, తొలి ఐదేళ్లలోనే ప్రజల ఆదరణ కోల్పోయారు. అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో ఒక్కసారి కూడా నేరుగా ప్రజల్లోకి వెళ్లిన దాఖలాలు లేవు. ఇప్పటివరకు ఒక్క మీడియా సమావేశం కూడా పెట్టిన సందర్భాలు లేవు.
గతంలో పాదయాత్ర పేరిట ప్రజల్లోనే ఉన్న జగన్, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లాలంటే జంకుతున్నారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నాం.. వారే ఓట్లు వేస్తారు అనే భ్రమలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. అయితే ప్రతిపక్ష నేతలపై దాడులు మాత్రం అదే రీతిలో కొనసాగిస్తున్నారు. కక్ష సాధింపు ధోరణిలో ఆయన రాజకీయాలు ఉంటున్నాయి. తాను పాదయాత్ర చేసినప్పుడు టీడీపీ కల్పించిన సెక్యూరిటీని మరిచిపోయి, ఇప్పుడు ప్రతిపక్ష నేతల పాదయాత్రలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ తన కుటిల మనస్తత్వాన్ని బయట పెట్టుకుంటున్నారు.
అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబును ఆధారాలు లేని కేసులో అరెస్ట్ చేయించారు. విద్యార్థులు, యువతీ యువకుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రాల్లో అక్రమాలు జరిగాయంటూ అభియోగాలు మోపారు. అయితే న్యాయస్థానం చంద్రబాబుకు 12 రోజుల రిమాండ్ విధించింది. దీని వెనుక జగన్ ఉన్నాడని ఏ చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. ఇక ఏపీ సీఐడీ ఆఫీసర్, ఏఏజీ ప్రవర్తన కూడా ఇందుకు ఊతమిస్తున్నది. ఏదేమైనా జగన్ తన చెట్టు కొమ్మను తానే నరుక్కున్నట్లు కనిపిస్తున్నది. టీడీపీ అధినేత చంద్రబాబుకు గతంలో లేనంతగా సానుభూతి వచ్చింది. దేశవిదేశాల్లో ఆయన కు మద్దతులభించింది. ఇక కొంత నిద్రావస్థలో ఉన్న టీడీపీ శ్రేణులను జగనే తట్టి లేపారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే వైసీపీ ఆగడాలు మరింతగా పెరిగిపోతాయనే భయం వారిలో ఉండగా, ఇక గెలుపు కోసం కష్ట పడేలా వారిలో కసి రేపారు. మరోవైపు టీడీపీ యువనేత లోకేశ్ ను జాతీయ స్థాయిలో పరిచయం చేశారు. ఆయన మాటతీరును చూసిన వారంతా భవిష్యత్ నాయకుడు అంటూ కొనియాడుతున్నారు. మరోవైపు జనసేనను టీడీపీ కి మరింత దగ్గర చేశారు. వైసీపీపై పోరులో భాగంగా పొత్తులతో ముందుకెళ్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టంగా ప్రకటించారు.
ఇక జనం నోళ్లలో టీడీపీకి మరో చాన్స్ ఇవ్వాలనే తలంపు తెచ్చారు. గతంలో జగన్ అరెస్ట్ అయిన సందర్భంలో ఆయన చేసిన అవినీతి పైనే చర్చ జరిగింది. కానీ ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయితే కేవలం ఆయన చేసిన అభివృద్ధి మాత్రమే చర్చకు వచ్చింది. 40 ఏండ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఇవన్నీ తెలవనివి కాదు. ఆయన సైలెంట్ వ్యూహంలో జగన్ అల్రెడీ చిక్కుకున్నారు. ఇక మిగిలింది 2024 ఎన్నికలే. ప్రజలు ఇప్పటికే తమ తీర్పు చెప్పేందుకు సిద్ధమయ్యారు. దేశంలోనే రాజధాని లేని రాష్ర్టంగా నాలుగేళ్ల పాటు ఏపీని మిగిల్చిన నేతగా జగన్ చరిత్రలో నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తున్నది. పొలవరం ప్రాజెక్టును అటకెక్కించారు. తెలంగాణ ప్రభుత్వంతో లాలూచి పడి ఏపీలో భూముల ధరల పడిపోయేలా చేశారనే అపవాదు మూటగట్టుకున్నారు. దీనికి తోడు ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వైసీపీ ప్రభుత్వ పతనానికి కారణమయ్యే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా జగన్ ఒక్క కేసుతో పెద్ద తప్పు చేశారు. తన పతనాన్ని తానే కొని తెచ్చుకున్నారు.