Protest Against Chandrababu Arrest :
ఏపీలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ నిరసనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ తో పాటు బెంగళూరులో ఐటీ ఉద్యోగులు కదం తొక్కగా, యూఎస్, ఆస్ర్టేలియా, దక్షిణాఫ్రికా దేశాల్లో అక్కడి తెలుగు ప్రజలతో పాటు తెలుగుదేశం అనుబంధ ఎన్ఆర్ఐలు అధినేత చంద్రబాబుకు సంఘీభావం గా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
ఇక దక్షిణాఫ్రికాలోని 78 లారెన్స్ స్ట్రీట్ , హాఫ్వే హౌస్, మిడ్రాండ్ లలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం పోయి ప్రజా ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. ఇక ఆస్ర్టేలియాలోని ప్రెసిడెంట్ పార్కు, వింధంవేల్ మెల్ బోర్న్ లో టీడీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని 400 మంది అభిమానులు ధర్నా కు దిగారు. ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని, ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే తలంపుతోనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నదని మండిపడ్డారు. కార్ల ర్యాలీ అనంతరం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో టీడీపీ నేతలు ఆలపాటి రాజా, జీవీ ఆంజనేయులు, నన్నపనేని రాజకుమారి పాల్గొన్నారు. నిరసన ప్రదర్శనలు చేపట్టిన ఎన్ఆర్ఐలను వారు అభినందించారు.
రానున్న రోజుల్లో టీడీపీ గెలుపునకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల టీడీపీ అధినేత చంద్రబాబు అనుకూల నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ఒక యూఎస్ లోని వివిధ నగరాల్లో నిత్యం నిరసన ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ను టెకీలు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు.