
Somesh Kumar : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ముఖ్య సలహాదారుగా మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం ఉదయం సెక్రటేరియట్ లోని 6వ అంతస్తులో తన ఛాంబర్ లో వేద మంత్రాల మధ్య ఆయన తొలి సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయనకు సెక్రటేరియట్ లోని అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు మరో సారి తెలంగాణలో అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన కృతజ్ఞతలు చెప్పుకున్నారు.
గతంలో చీఫ్ సెక్రటరీ (సీఎస్)గా ఉన్న సమయంలో ఆయన వ్యవహార శైలిపై ప్రతిపక్షాలు చాలా సార్లు ఆందోళన చెందాయి. తమను ఆయన అస్సలు పట్టించుకోవడం లేదని. సోమేశ్ కుమార్ ను నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణలో కొనసాగిస్తున్నారని, ఆయనను తిరిగి పంపించే వేయాలని పట్టు బట్టారు. దీనిపై కోర్టు వెళ్లడంతో కోర్టు కూడా సోమేశ్ కుమార్ ను ఆంధ్రప్రదేశ్ కు పంపించాలని ఆదేశించింది. అయితే అక్కడికి వెళ్లిన సోమేశ్ కుమార్ సంక్రాంతికి ముందు రిటైర్మెంట్ ప్రకటించుకున్నారు.
రెండు నెలల్లోనే సోమేశ్ కుమార్ ను తెలంగాణ ప్రభుత్వంలోకి తీసుకుంటున్నట్లు సీఎం ప్రకటించారు. దీనిపై మళ్లీ ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. అయితే ఆయనను బీఆర్ఎస్ పార్టీని విస్తృతం చేసేందుకు నార్త్ సైడ్ ఇన్ చార్జిగా నియమిస్తున్నట్లు మొదట వాదనలు వినిపించాయి. వాటన్నింటకి చెక్ పెడుతూ సీఎంకు ముఖ్య సలహాదారుడిగానే కన్ఫామ్ చేశారు కేసీఆర్. దీనిపై మళ్లీ ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉండేది ఇంకా ఆరు నెలలే అని కానీ సోమేశ్ ను మాత్రం మూడేళ్లు ఈ పదవిలో ఉండేలా ఎందుకు జీవో తెచ్చారని గగ్గోలు పెడుతున్నారు. కేసీఆర్ అవినీతి సోమేశ్ కు తెలుసుకాబట్టి ఆయన పెదవి విప్పకుండా కేసీఆర్ కాపాడుకుంటున్నారని ప్రతి పక్షాలు మండిపడుతున్నాయి.
ఈ గందరగోళం నేపథ్యంలో సోమేశ్ కుమార్ శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఆయనే సీఎం ముఖ్య సలహాదారుడిగా మూడేళ్లు పదవిలో కొనసాగుతారు.