
Sr NTR Acting : నటసార్వభౌముడు, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత, తెలుగు రాష్ర్టాల ప్రజలు ముద్దుగా అన్నగారు అని పిలుచుకునే వ్యక్తి నందమూరి తారక రామారావు. మరెవరికీ సాధ్యం కాని ఆప్యాయత, ప్రేమాభిమానాలను పొంది, ఈ లోకాన్ని విడిచి 25 ఏండ్లు గడిచినా ఇంకా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా పేరొందుతున్న ఆయనకు సాటి మరొకరు లేరు. తెలుగు చిత్రరంగానికి వెలుగు ఆయన. తెలుగు భాష, సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన మహానటుడు ఆయన. తెలుగు పౌరషాన్ని ఎలుగెత్తి చాటిన మహానీయుడు ఆయన. తెలుగు వారి ఆత్మగౌరవ నినాదాన్ని చేయ్యెత్తి జైకొట్టిన యుగపురుషుడు ఆయన. ఎంత చెప్పినా ఆయన గురించి మాటలు చాలవు. అదే ఎన్టీఆర్ అంటే.
తెలుగులో ఎవరికీ సాధ్యంకాని జానపద, పౌరాణిక, చారిత్రత్మక చిత్రాల్లో సీనియర్ ఎన్టీఆర్ నటించారు. రాముడు, కృష్ణుడు, పాత్ర ఏదైనా ఆయన ఒదిగిపోతారు. కొన్ని పాత్రలకు మరొకరిని ఊహించలేని విధంగా ఎన్టీఆర్ తనదైన యాక్టింగ్ తో అలరించారు. చరిత్రలో మనకు తెలిసిన ఎన్నో పాత్రలు ఎన్టీఆర్ ను ఊహించుకునేలా చేశారు. కెమెరా తనవైపు ఉన్నా లేకపోయినా నటనలో మునిగితేలే నటుడాయన. చివరకు బృహన్నల పాత్రను కూడా తనదైన శైలిలో పోషించారయన, రాముడు, కృష్ణుడు, భీష్మ, బడిపంతులు ఇలా అన్ని పాత్రల్లో ఆయన ఒదిగిపోయారు. 2017లో మాజీ ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తెలుగు సినిమాల్లో తనకు ఇష్టమైన నటుడు ఎన్టీఆర్ మాత్రమేనని చెప్పి, ఆ అన్నగారిపై తన అభిమానాన్ని చెప్పారు. ఎన్టీఆర్కు ఎందరో ముఖ్యమంత్రులు, ప్రముఖులు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.
అయితే ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఎన్టీఆర్ గారి వీరాభిమాని డాక్టర్ జ్యోతి గారు ఎన్టీఆర్ గారి గురించి స్పష్టంగా చెప్పి ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ ను చాలా మంది ఎందుకు అభిమానిస్తారో తనదైన శైలిలో వర్ణించారు. ఆహార్యం పెద్దదైనా దానికి తగ్గట్టూ పాత్రలు హావభావాలు చూపించడంలో ఎన్టీఆర్కు సరిపోలే హీరో లేడంటే అతిశయోక్తి కాదన్నారు. ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన ఎన్టీఆర్ కు తగిన దక్కలేదని తెలుగు సినిమా అభిమానులు, ప్రజల మనసుల్లో నిలిచిపోయిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ తరం పిల్లలు ఎన్టీఆర్ చరిత్రను గుర్తించలేదని బాధపడ్డారు. కారణమేదైనా ఇప్పటివరకు ఎన్టీఆర్కు దక్కాల్సిన గౌరవం లభించలేదని బాధపడ్డారు. హాలివుడ్ , బాలీవుడ్ నటులకూ ఇది సాధ్యం కాలేదని చెప్పుకొచ్చారు.
ప్రపంచంలో ఏ యాక్టర్ కూడా ఇన్ని రకాల పాత్రలను పోషించిన దాఖలాలు లేవని, భవిష్యత్ లో కూడా ఉండబోరని స్పష్టం చేశారు. నాడు అభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేయడంలో ఎన్టీఆర్ నటన ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యుగపురుషుడిగా పిలిపించుకున్న ఏకైక నటుడు ఆయన. విలనిజంలో కూడా హీరోయిజాన్ని చూపిన ఘనత ఎన్టీఆర్ కు దక్కుతుంది. భావి తరాలకు కూడా కొన్ని పాత్రలు, కథలు, పౌరాణిక పాత్రల గురించి చెప్పాలంటే ఎన్టీఆర్ నటించిన చిత్రాలను చూపించాల్సిందే. పాత్ర ఏదైనా తనకు సాధ్యం కాదని ఏనాడూ ఎన్టీఆర్ అనలేదు. నటనలో తనకంటూ ఎన్నో కీర్తిశిఖరాలు అధిరోహించారు. మాటలకందని నటన ఆయనది. మహోన్నతుడు ఎన్టీఆర్. చిరస్మరణీయుడు ఎన్టీఆర్..