
ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఆస్కార్ కలను నిజం చేసాడు. భారత్ చిత్రాలకు ఆస్కార్ దక్కుతుందా ? అని గతకొంత కాలంగా తీవ్రంగా వేధిస్తున్న సమస్య. అయితే సినిమాలను తీయడమే కాదు ……. తీసిన దాన్ని సరైన దిశలో ప్రమోట్ చేయగలిగితే ఆస్కార్ అసాధ్యమేమీ కాదని నిరూపించిన దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి.
శాంతి నివాసం అనే సీరియల్ తో దర్శకుడిగా మారాడు ఎస్ ఎస్ రాజమౌళి. కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ తనయుడైన ఎస్ ఎస్ రాజమౌళి కథా చర్చల్లో పాల్గొనే సమయంలోనే ఆ సీన్ ఇలా చేయాలి , ఆ సీన్ అలా చేయాలి అంటూ వాదించే వాడట. అయితే అప్పట్లో అతడి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు కాబట్టి పాపం ! జక్కన్న చెప్పే సలహాలు చాలామంది దర్శకులు తీసుకోలేదట. పైగా అవమానించిన సంఘటనలు కూడా కోకొల్లలుగా ఉన్నాయట.
అయితే తన లోని ఆలోచనలకు రూపం ఇవ్వాలంటే కథా రచయితగా తండ్రితో కలిసి కూర్చుంటే లాభం లేదని , మెగా ఫోన్ చేతబట్టాలని ఫిక్స్ అయ్యాడట. దాంతో గట్టి ప్రయత్నాలే చేసి రాఘవేంద్రరావుని మెప్పించి ఒప్పించి దర్శకత్వ శాఖలో కొన్నాళ్ళు మాత్రమే పనిచేసాడు. అతడిలోని ప్రతిభను గమనించిన రాఘవేంద్రరావు శాంతి నివాసం అనే సీరియల్ కు దర్శకత్వం వహించమని ఆఫర్ ఇచ్చాడు. ఇంకేముంది ఆ సీరియల్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు రాజమౌళి. శాంతినివాసం బుల్లితెరపై సంచలన విజయం సాధించింది.
అయితే …… సీరియల్ కు దర్శకత్వం వహించి హిట్ కొట్టినప్పటికీ తనని తాను నిరూపించుకున్నప్పటికీ రాజమౌళి కష్టాలు తీరలేదు. సినిమా అవకాశం ఇచ్చాడు రాఘవేంద్రరావు. హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ను ఇచ్చాడు. నూనూగు మీసాల ఎన్టీఆర్ ను చూసి భోరున ఏడ్చాడట రాజమౌళి. ఇంత లావుగా ఉన్నాడు వీడు హీరో ఏంటి ? నా ఖర్మ కాకపోతే అని. అంతేకాదు ఈ కష్టాలు చాలవన్నట్లుగా స్టూడెంట్ నెం 1 చిత్రానికి దర్శకుడు రాజమౌళి అయినప్పటికీ ……. దర్శకత్వ పర్యవేక్షణ కె. రాఘవేంద్రరావు వేసుకున్నారు…… ఆయనే కొని సీన్లు పర్యవేక్షించాడు కూడా.
అయితే స్టూడెంట్ నెం 1 షూటింగ్ రెండు వారాలు గడిచాక ఎన్టీఆర్ ని తిట్టుకున్న రాజమౌళి అతడి ప్రేమలో పడిపోయాడు. అప్పటి నుండి ఎన్టీఆర్ – జక్కన్న జిగిరీ ఫ్రెండ్స్ అయ్యారు. ఆ విషయం పక్కన పెడితే స్టూడెంట్ నెం 1 చిత్రం పూర్తి చేసాడు …… విడుదల అయ్యింది. కట్ చేస్తే …. సూపర్ హిట్ అయ్యింది. ఇంకేముంది అప్పుడు రాజమౌళి పేరు మారుమ్రోగింది.
అయితే సోలోగా చేసిన సినిమా సింహాద్రి తో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాడు దాంతో కొత్త చరిత్ర సృష్టించాడు. ఇక అప్పటి నుండి రాజమౌళి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండాపోయింది. ఇప్పటి వరకు ఒక్కో సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచుకుంటూ పోతూనే ఉన్నాడు. బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా ఎల్లలు దాటేలా చేసాడు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తం చేసాడు. ఇక ఇప్పుడేమో ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో ఆస్కార్ ను కూడా తెలుగు సినిమాను వరించేలా చేసి తెలుగువాడి సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి చాటి చెప్పాడు. తెలుగు జాతికి మాత్రమే కాదు యావత్ భారతావనికి గర్వకారణంగా నిలిచాడు ఎస్ ఎస్ రాజమౌళి. దాంతో ఈ దర్శక ధీరుడు పై ప్రశంసల వర్షం కురుస్తోంది.