
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. సాధారణంగా అయితే 2024 ఏప్రిల్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే అప్పటి వరకు ఎదురు చూడకుండా 2023 ఏప్రిల్ లేదా మే నెలలో ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులను కలిసిన విషయం తెలిసిందే.
పేరుకు ఏపీ విభజన హామీలపై ప్రధానితో పాటుగా కేంద్ర మంత్రులను కలిసినట్లుగా ప్రచారం జరిగినప్పటికీ ……. అసలు నిజం వేరే ఉందట. ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి మీ అనుమతి కావాలని , మీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదు కానీ పార్లమెంట్ లో మీవెంటే ఉంటామని చాలా స్పష్టంగా చెప్పాడట జగన్. గత మూడున్నర సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగానే ఉంటోంది జగన్ ప్రభుత్వం. అవసరమైన అన్ని బిల్లులకు బేషరతుగా మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక ముందు కూడా ఇదే ధోరణి అవలంభిస్తామని , అందుకు మీ ఆశీస్సులు కావాలని మోడీ – షా ద్వయాన్ని కోరినట్లు తెలుస్తోంది.
ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా తెలుగుదేశం, జనసేన పార్టీలను కోలుకోకుండా చేయాలనే మాస్టర్ ప్లాన్ లో ఉన్నాడట జగన్. ప్రభుత్వం పై పూర్తి స్థాయిలో వ్యతిరేకత లేదు కాబట్టి ఆ పార్టీలు కోలుకోకముందే ఎన్నికలకు వెళ్లడం ద్వారా భారీగా లబ్ది పొందొచ్చన్నది జగన్ వ్యూహంగా కనబడుతోంది.
ఇక ఇదే సమయంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా చాలాకాలంగా చెబుతున్న మాట ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగడం ఖాయమని. అందుకే నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ప్రజల్లో తిరుగుతూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చంద్రబాబు, లోకేష్ లతో పాటుగా తెలుగు తమ్ముళ్లు అలాగే టీడీపీ ఎన్నారైలు కూడా భావిస్తున్నారు……. జగన్ ప్రభుత్వం పై కసిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ బీజేపీ తో పొత్తులో ఉంటూనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీతో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాడు. అయితే బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాత్రం టీడీపీతో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని అంటోంది. ఎన్నికల నాటికి ఈ పరిస్థితిలో మార్పు రావచ్చు . కేంద్ర నాయకత్వం అందుకు ఒప్పుకుంటే ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారడం ఖాయం. మొత్తానికి అందుతున్న సమాచారం ప్రకారం ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమని తెలుస్తోంది.