
Comedian Saptagiri :
వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు కమెడియన్ సప్తగిరి ప్రకటించారు. తిరుపతిలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు మాట్లాడారు. తనకు పార్టీ నుంచి ఆఫర్ వచ్చిందని త్వరలోనే శుభవార్త చెబుతానని చెప్పారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తాననేది పార్టీ పెద్దలు చెబుతారని, టీడీపీలో తన పాత్ర ఏంటో కూడా వారే చెబుతారని తెలిపారు. 2024 ఎన్నికల్లో ఏపీలో టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తన వంతుగా పని చేస్తానని ప్రకటించారు. అయితే సప్తగిరి తనది చిత్తూరు జిల్లా అని తెలిపారు. మరో 10, 15 రోజుల్లో రాజకీయ ప్రవేశం గురించి తానే ప్రకటిస్తానని చెప్పారు. రాష్ట్రం కోసం చంద్రబాబు ఎంతో కష్టపడతారని, అభివృద్ధిలో ఆయన ముందు ఉంటారని తెలిపారు. అందుకే టీడీపీలో చేరాలనుకున్నట్లు తెలిపారు. తనది కష్టపడే మనస్తత్వమని అందుకే సినిమా రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నానని తెలిపారు. జిల్లాతో తనకు విడదీయలేని అనుబంధం ఉందన్నారు. ఐరాలలో పుట్టానని, బంగారుపాళ్యం పుంగనూరులో చదివానని తెలిపారు. చిత్తూరు నుంచి అసెంబ్లీకి కానీ పార్లమెంటుకు గాని పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలను వదులుకోనని, నటించడం కొనసాగిస్తానని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ బాబు ఆశీస్సులతో త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు ఆయన మనసులో మాటను బయటకు చెప్పారు. ఇటీవల యువగళం పాదయాత్రలో ఉన్న లోకేష్ బాబును కలిశానని, ఈ మేరకు మాట్లాడినట్లు తెలిపారు.
ఇప్పటికే చిత్తూరు జిల్లా నుంచి పలువురు సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చిన వారు ఉన్నారు. దివంగత శివప్రసాద్ కూడా సినిమారంగం నుంచి వచ్చినవారే. నగరి ఎమ్మెల్యే రోజా కూడా సినిమా రంగం నుంచి వచ్చినవారే. ఆమె తొలుత టీడీపీలో ఉన్నా, ఆ తర్వాత వైసీపీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం జగన్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేస్తున్నారు. చంద్రబాబుపై విమర్శలు చేయడంలో ఆమె ముందుంటారు. మరి ఇప్పుడు అదే జిల్లా నుంచి మరో స్టార్ కమెడియన్ సప్తగిరి కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారు. అయితే సప్తగిరి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు.. పార్టీ అధిష్టానం ఆయన సేవలను ఎలా ఉపయోగించుకుంటుందో తెలవాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సి ఉంది. అయితే టీడీపీ నుంచే పోటీ చేస్తానని సప్తగిరి ప్రకటించడం ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపింది. ముందు నుంచి టీడీపీకి సినిమా వాళ్లతో దగ్గరి సంబంధం ఉంది. పార్టీని పెట్టిన అన్న ఎన్టీఆర్ కూడా సినిమా రంగం నుంచి వచ్చినవారే. ఆయనతో అభిమానంతో మరికొందరు కూడా పార్టీలోకి చేరి, వివిధ హోదాల్లో కొనసాగారు. మరికొందరు కొనసాగుతున్నారు. ఇప్పుడు కామెడీతో అలరించే సప్తగిరి కూడా రాజకీయ కండువా కప్పుకోబోతున్నారు.






