
Star hero vishal : తమిళ సినీ నటుడు విశాల్ ఆదివారం తమిళనాడులోని విల్లుపురంలో జరిగిన మిస్ కూవాగం ట్రాన్స్‌జెండర్ బ్యూటీ కాంటెస్ట్ కార్యక్రమంలో వేదికపైనే స్ప్రహతప్పి పడిపోయారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ట్రాన్స్‌జెండర్లతో కలిసి ఫోటోలు దిగుతున్న సమయంలో విశాల్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే స్పందించి ఆయన్ను పైకి లేపి, చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
విశాల్ మేనేజర్ హరి, అతని నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ తెలిపిన వివరాల ప్రకారం, మధ్యాహ్నం సరిగ్గా భోజనం చేయకపోవడం.. కేవలం జ్యూస్ మాత్రమే తీసుకోవడం వల్ల అలసటతో విశాల్ స్ప్రహతప్పి పడిపోయారు.
ప్రస్తుతం విశాల్ ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యులు పరీక్షలు నిర్వహించారని, సమయానికి ఆహారం తీసుకోవాలని సూచించారని ఆయన టీమ్ వెల్లడించింది. గతంలో కూడా విశాల్ ఆరోగ్యంపై కొన్ని సందర్భాల్లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి.