Station Ghanpur Constituency Review : ఒకే పార్టీలోనే వేరు కుంపట్లు
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజవర్గంలో టికెట్ల లొల్లి బజారున పడింది. కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య పోటీ తీవ్రమైంది. టికెట్ నాదంటే నాదే అనే కోణంలో ఇద్దరు తీవ్ర విభేదాల్లో పడిపోయారు. మాటల యుద్ధం పెరుగుతోంది. వారి మధ్య సవాళ్లు పెరుగుతున్నాయి. కడియం శ్రీహరిపై రాజయ్య అవినీతి ఆరోపణలు చేయడం దానికి బదులుగా శ్రీహరి బదులివ్వడం చర్చనీయాంశం అయిపోయింది.
ఈనేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ ముదరకుండా బీఆర్ఎస్ అధిష్టానం రంగంలోకి దిగినా సద్దుమణగడం లేదు. ఇద్దరు టికెట్ తమదేనని ప్రచారం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు బలంగా లేని చోట మార్పులకు కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే రాజయ్యకు టికెట్ నిరాకరించారనే వాదన ఉంది. కార్యకర్తల బలం తనవైపు ఉందని కడియం చెబుతున్నారు. నియోజకవర్గాన్ని డెవలప్ చేశానని రాజయ్య చెప్పుకుంటున్నారు.
గులాబీ పార్టీ పెద్దలు ఇద్దరికి నచ్చజెప్పినా వినిపించుకోవడం లేదు. ఎవరి వాదన వారే వినిపిస్తున్నారు. తగ్గేదే లే అని సవాలు విసురుతున్నారు. ఈ క్రమంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వేల్లో వచ్చిన ఫలితాల ఆధారంగానే కేసీఆర్ టికెట్లు ఖరారు చేసినట్లు సమాచారం. అందుకే రాజయ్యకు టికెట్ ఇవ్వలేదని చెబుతున్నారు.
ప్రస్తుతం స్టేషన్ ఘన్ పూర్ వ్యవహారం పార్టీకి గుదిబండగా మారింది. టికెట్ విషయంలో తమదే పైచేయి అని ఇద్దరు ప్రకటనలు చేస్తున్నారు. దీంతో ఇక్కడ పోటీ చేసి విజయం సాధించేది ఎవరో తేలడం లేదు. టికెట్ శ్రీహరికి ఇచ్చినా రాజయ్య కూడా మరోవైపు పోటీలో ఉంటానని తెగేసి చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది. బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.