Strange Town : కొన్ని ప్రాంతాల్లో వింత ఆచారాలు, నమ్మకాలు, నియమాలు ఉంటాయి. ఇతరులకు అవి విడ్డూరంగా అనిపించినా స్థానికులు మాత్రం వాటిపై కఠినంగా ఉంటారు. ఎవరెన్ని చెప్పినా వారి నమ్మకాలను, నియమాలను మాత్రం మార్చుకోరు. అయితే వీటిని మనం కొట్టిపారేయలేం. స్థానిక పరిస్థితులు, శాస్త్రీయ ఆధారాలు కూడా కొన్ని నమ్మకాలు, నియమాల్లో ఉంటాయి.
ఉదాహరణకు ఒక చిన్న పట్టణంలో మీరు అడుగుపెట్టాలంటే అపెండెక్టమీ చేయించుకోవాలి. అంటే సర్జరీ ద్వారా అపెండిక్స్ లేదా ఉండుకం తొలగించుకోవాల్సిందే. అసలెందుకు తొలగించుకోవాలి.. ఉండుకానికి ఆ ఊరుకు ఉన్న సంబంధం ఏంటి..ఇదేం వింత రూల్.. ఎక్కడ ఉందా ఊరు.. అనుకుంటున్నారా? ఈ స్టోరీ చదవేయండి మరి..
అంటార్కిటికాలో విల్లా లాస్ ఎస్ట్రెల్లాస్ అనే చిన్న పట్టణం ఉంది. ఎండాకాలంలో ఇక్కడ కేవలం 100మంది మాత్రమే ఉంటారు. శీతాకాలం వస్తే ఇక అందులో సగం మంది సర్దుకుని బయటకు వచ్చేస్తారు. ఈ ప్రాంతం ప్రపంచానికి దూరంగా విసిరేసినట్టు ఉంటుంది. పైగా గడ్డకట్టిన ఆ ఖండంలో చలి చంపేస్తూ ఉంటుంది. ఇక్కడి రెండు పట్టణాల్లో మాత్రమే జనాలు జీవిస్తారు. అందులో విల్లా లాస్ ఎస్ట్రెల్లాస్ ఒకటి. స్పానిష్ లో దీని అర్థం స్టార్ టౌన్. మరో పట్టణం ఎస్పీ రంజా.
‘విల్లా లాస్ ఎస్ట్రెల్లాస్’ కింగ్ జార్జ్ ద్వీపంలో ఉంది. ఇది చిలీ అంటార్కిటిక్ భూభాగంలో ఉంది. ఇక్కడికి చాలా మంది సైనిక సిబ్బంది, వివిధ శాస్త్రీయ ప్రాజెక్టులలో పనిచేసే పరిశోధకులు వస్తుంటారు. వారిలో కొందరు కుటుంబాలను వెంట తీసుకుని వస్తారు. కానీ వారు వచ్చే ముందు కచ్చితంగా అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించుకునే రావాలి.
దీనికి కారణం.. ఈ ఊరిలో స్పెషలిస్ట్ డాక్టర్లు ఉండరు. సర్జన్ కావాలంటే 1000 కి.మీ. ప్రయాణించాల్సి వస్తుంది. అక్కడకు చేరుకోవాలంటే దక్షిణ మహాసముద్రంపై వెళ్లాలి. ఆ ప్రయాణం తీవ్ర భయంకరంగా ఉంటుంది. ఒక వేళ అపెండిసైటిస్ వస్తే సర్జరీ చేసుకోవాలంటే.. సుదీర్ఘమైన, భయంకర ప్రయాణంతో ప్రాణాలకు ముప్పు ఏర్పడవచ్చు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా ఈ రూల్ పెట్టారు.
మాములు వైద్యం ఇక్కడ అందుబాటులో ఉన్నా అపెండిసైటిస్ లాంటి సడెన్ సర్జరీలు ఇక్కడ చేయరు. అందుకే ఈ ప్రాంతం వచ్చేవారు ముందే సర్జరీ చేయించుకుని రావాలి. అలాగే ఇక్కడ నివసించేవారు గర్భం దాల్చరు. ఎందుకంటే తల్లి, బిడ్డకు ప్రమాదకరం. అందుకోసం వేరే ప్రాంతాలకు వెళ్లి.. పిల్లలు పుట్టాక ఇక్కడికి తిరిగొస్తారు. ఇక మెయిన్ ల్యాండ్ నుంచి ఎప్పుడో ఒకసారి వచ్చే కూరగాయలు, నిత్యావసర సరుకులతో జీవనం సాగిస్తూ ఉంటారు.