volunteer system :
ఏపీలో వలంటీర్ల వ్యవస్థ బలంగా పాతుకుపోయింది. గడిచిన నాలుగేళ్లలో గ్రామాల్లో వారు చెప్పిందే నడుస్తున్నది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు సకాలంలో చేర్చడం ద్వారా వారు ప్రజల మన్ననలు పొందారు. గత ప్రభుత్వాల హయాంలో పడ్డ కష్టాలకు విరుగుడుగా వీరంతా ప్రజలకు కనిపించారు. ఇదే సందర్భంలో వైసీపీ పార్టీకి సమన్వయకర్తలుగా కూడా వీరు గ్రామాల్లో అనఫీషియల్ విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో వలంటీర్లు చెప్పిన వారికే పథకాలు వర్తిస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్ను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియమించింది. దీంతో ఆయా కుటుంబాల్లో ఏం జరుగుతుంది. వారి ఆదాయం.. వారి కుటుంబ సభ్యులు.. వారి జీవన స్థితి ఈ వలంటీర్లకు పూర్తి అవగాహన ఉంటుంది.
ఒకరకంగా స్థానిక అధికారులకు సమాంతరంగా వలంటీర్ల వ్యవస్థ పనిచేస్తున్నది. ఎన్నికల్లో ప్రజల నాడిని మార్చే సత్తా కూడా వీరికి ఉన్నట్లు గ్రామాల్లో టాక్ వినిపిస్తున్నది. ఇలాంటి సమయంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వలంటీర్ల వ్యవస్థపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. వలంటీర్ల బలమెంటో తెలియకుండా ఆయన ఆరోపణలు చేశారని కొందరు భావిస్తున్నారు. అయితే వలంటీర్లు ఇప్పుడు జనసేనపై అగ్రహంతో ఉన్నారు. ఇన్నాళ్లు వైసీపీ నేతలు చెప్పిన పనులే చేసిన ఈ వలంటీర్లు మరింతగా రెచ్చిపోయే అవకాశమున్నదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఎన్నికల సమయంలో పవన్కళ్యాణ్ అనవసరంగా వలంటీర్లతో పెట్టుకున్నారని కొందరు నేతలు తలలు పట్టుకున్నారు. జనసేనతో పొత్తుతో వెళ్లామనుకున్న టీడీపీకి కూడా ఇది సంకటంగా మారింది. ఇలాంటి క్రమంలో ప్రజల్లో చర్చ మొదలుపెట్టామని జనసేన భావిస్తున్నా. ఆ స్థాయిలో చర్చ జరుగుతుందా అనేది కూడా అనుమానంగానే కనిపిస్తున్నది. ఒకవేళ వలంటీర్ల వ్యవస్థ పై ప్రజల్లో అనుమానులు రేకెత్తితే మాత్రం పవన్ ఈ విషయంలో సక్సెస్ అయినట్లుగానే భావించవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది వలంటీర్లు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తే మాత్రం కొంత ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
మరి ఇలాంటి సమయంలో కొంత టీడీపీ, జనసేనలకు ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. అయితే పవన్ మాత్రం డిగ్రీ చదివిన యువతను కేవలం రూ. 5వేల కే ప్రభుత్వం వాడుకుంటున్నదని, ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందనే ఇలా చేస్తున్నదని ఆయన ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ఏపీలో వలంటీర్ల వ్యవస్థ మాత్రం బలంగా పెనవేసుకున్నట్లే కనిపిస్తున్నది. సమాంతర గవర్నింగ్ వ్యవస్థ వలంటీర్ల రూపంలో తయారైందని, ఇది అత్యంత ప్రమాదకరమని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ విషయాల్లో వీరి జోక్యం పెరిగిందని అంతా అంటున్నారు. అయినా వైసీపీ అధినేత జగన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.