
Studying in Australia : ఆస్ట్రేలియా యూనివర్సిటీలు భారత విద్యార్థులపై ఆగ్రహంతో ఉన్నాయి. ఒక వీసాపై వచ్చి మరో పని చేస్తున్నారని మండిపడుతున్నారు. చదువుకునే వీసాపై వచ్చిన స్టూడెంట్స్ కొందరు వివిధ పనులు చేస్తున్నారని అందుకే వారికి వీసాలను నిలిపివేయాలని విశ్వవిద్యాలయాలు ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్ నుంచి వచ్చే కొన్ని రాష్ట్రాల విద్యార్థుల వీసాలను తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆస్ట్రేలియా చదువుకు ఆ రాష్ట్రాలు దూరమైనట్లు తెలుస్తుంది.
ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, పంజాబ్, హర్యానా, జమ్ము కశ్మీర్ విద్యార్థుల వీసాల జారీపై ఆస్ట్రేలియా గవర్నమెంట్ తాత్కాలికంగా నిషేధం విధించాయి. ఈ రాష్ట్రాల నుంచి వీసాల దరఖాస్తులు తీసుకోవద్దని ఫెడరేషన్ యూనిర్సిటీ, వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీలు ఎడ్యుకేషన్ ఏజెంట్లకు నోటీసులు జారీ చేశాయి. దీనిపై ఇప్పటికే వ్యక్తిగతంగానూ, మెయిల్స్ లోనూ పంపినట్లు ఫెడరేషన్ యూనివర్సిటీ తెలిపింది.
అయితే ఈ రాష్ట్రాల విద్యార్థులు చేస్తున్న దరఖాస్తుల్లో చాలా వరకు నిజమైనవి కావని, మోసపూరితమైనవిగా ధృవీకరించబడ్డాయని ఆస్ట్రేలియా హోం మినిస్ట్రీ తెలిపింది. అయితే ఈ వీసాల జారీని తాత్కాలికంగానే నిలిపివేస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. భారత్ నుంచి వచ్చిన వీసా దరఖాస్తుల్లో తిరస్కరణ గురి కావడం దాదాపు పదేళ్లలో ఇదే అని వెల్లడించారు. భారత్ నుంచి వచ్చే దరఖాస్తుల్లో దాదాపు 25 శాతం మోసపూరితమైనవిగా ఉన్నాయని ఆ దేశ అధికారులు వెల్లడించారు. ఈ నిషేదం కనీసం 2 నెలల వరకూ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీనిపై భారత్ ఇంత వరకూ స్పందించలేదు. కానీ త్వరలో ఆస్ట్రేలియా అధికారులతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు మోస పూరితంగా వ్యవహరించవద్దని సూచిస్తోంది.