YouTube India : ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ వేదిక యూట్యూబ్ లో కొన్ని ఛానళ్లు.. తల్లులు, కుమారులకు సంబంధించి అసభ్యకర వీడియోలను పోస్ట్ చేస్తుండడంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై యూ ట్యూబ్ ఇండియాకు సమన్లు జారీ చేసింది. జనవరి 15వ తేదీ సంస్థ ఇండియా ప్రతినిధి తమ ఎదుట వ్యక్తి గతంగా హాజరవ్వాలని భారత్ యూట్యూబ్ పబ్లిక్ పాలసీ హెడ్ మీరా ఛాట్‌కు.. కమిషన్ లేఖ రాసింది.
‘ఈ వీడియోలు చిన్నారుల భద్రత, శ్రేయస్సుకు హాని కలిస్తాయని కమిషన్ పేర్కొంది. వీటిని మైనర్లు కూడా వీక్షించేలా ఉంచడంపై ఆందోళనకరం’ అని లేఖలో పేర్కొంది. అసభ్యకర కంటెంట్‌ను యూట్యూబ్ నుంచి తొలగించేందుకు ఎలాంటి మెకానిజం వినియోగిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించింది. సమన్ల యూట్యూబ్ ఇండియా స్పందించకపోతే అరెస్ట్ ను ఎదుర్కోవాలని హెచ్చరించింది.
దీనిపై కమిషన్ చీఫ్ ప్రియాంక్ కనూంగో మాట్లాడుతూ ‘తల్లులు, యుక్త వయస్సు కుమారుల మధ్య అసభ్యకర సన్నివేశాలతో ఛానళ్లు వీడియోలను పెడుతున్నాయి. ఇవి పోక్సో చట్టం కిందకు వస్తాయి. ఇలాంటి వీడియోలతో వ్యాపారం, అశ్లీల దృశ్యాలను అమ్మడంతో సమానం. దీనిపై యూట్యూబ్ వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇలాంటి దారుణాలకు పాల్పడే వారిని జైలుకు పంపించాలి’ అంటూ మండిపడింది.
కమిషన్ నిర్ణయాన్ని ప్రతీ ఒక్కరూ స్వాగతిస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన కంటెంట్లతో యువత సైతం చెడిపోతుందని పలువురు అంటున్నారు. సోషల్ మీడియా ఇన్ఫుయెన్సర్లు కూడా కమిషన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఇప్పుడు గట్టి చర్యలు తీసుకుంటేనే మరోసారి ఇలాంటివి రిపీట్ కావని మరికొందరు అంటున్నారు.