South Actor : తమలోని నటనను పూర్తి స్థాయిలో వెలికి తీయాలని నటులు ఉవ్విళ్లూరుతారు. కెరీర్ కూడా ముందుకు సాగాలని పరిధులను అన్వేషిస్తారు. తన కెరీర్ లో భారీగా మార్పులు చవి చూసిన నటుల్లో సునీల్ ఒకరు. కమెడియన్ గా మనల్ని నవ్వించడం దగ్గరి నుంచి సోలో హీరో పాత్ర వరకు, ఇప్పుడు బహుముఖ ప్రజ్ఞాశాలి పాన్ సౌత్ నటుడిగా ఎదుగుతున్న సునీల్ సినీ ప్రస్థానం వినోదాత్మకంగా ఉంటుంది.
కమెడియన్ గా తన నట ప్రస్థానాన్ని ప్రారంభించిన సునీల్ అద్భుతమైన నటనను ప్రదర్శించి ప్రేక్షకులను మెప్పించాడు. కామెడీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకొని ప్రశంసలు, అభిమానులను సంపాదించుకున్నారు.
అయితే కాలం గడుస్తున్నా కొద్దీ సునీల్ సోలో హీరోగా మారి కొత్త ఛాలెంజ్ ను స్వీకరించాలని డిసైడ్ అయ్యాడు. ఇది సాహసోపేతమైన చర్య, కొంతకాలం, అతను కమెడియన్ గా సాధించిన విజయాన్ని అలాగే కంటిన్యూ చేస్తాడని అంతా అనుకున్నారు. టాలెంట్, డెడికేషన్ ఉన్నప్పటికీ హీరోగా తను నిలదొక్కు కోవడం సునీల్ కు సవాలుగా మారింది.
సునీల్ మరోసారి క్యారెక్టర్ రోల్స్‌పై ఫోకస్ పెట్టి కామెడీ రూట్స్ లోకి వెళ్లాలని నిర్ణయించుకోవడంతో అతని ప్రయాణం మరో మలుపు తిరిగింది. ఈ దశలోనే ఇతర దక్షిణాది భాషల్లో, ముఖ్యంగా తమిళంలో తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడం మొదలుపెట్టాడు.
సునీల్ ప్రత్యేకత ఏంటంటే ఆయన కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే నటించడం లేదు. తమిళ సినిమాల్లో కూడా చురుగ్గా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు.
తమిళ చిత్ర పరిశ్రమలో సునీల్ కు ఉన్న పాపులారిటీ, స్టార్ డమ్ ఆయనకు గణనీయమైన రెమ్యునరేషన్ ను తెచ్చిపెట్టి కోలీవుడ్ లో డిమాండ్ ఉన్న నటుడిగా నిలిపాయి. ‘జైలర్’, ‘మావీరన్’, ‘జపాన్’, ‘మార్క్ ఆంథోనీ’ వంటి తమిళ చిత్రాల్లో తన నటనా చాతుర్యాన్ని చూపించారు. పుష్ప లాంటి సినిమాలతో పాన్ ఇండియా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు సునీల్.
విభిన్నమైన పాత్రలు, పరిశ్రమల మధ్య సులువుగా తన కెరీర్ ను ముందుకు నడిపిస్తున్నాడు. ఇదే ఆయనను ప్రత్యేకమైన నటుడిగా నిలుపుతుంది. రీజనల్ యాక్టర్ అనే ముద్రను విజయవంతంగా బద్దలు కొట్టి ఇప్పుడు పాన్ సౌత్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సునీల్.
కోలీవుడ్ లో తన నటనకు గానూ సునీల్ భారీ మొత్తాన్ని రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నాడని, తెలుగులో కూడా అత్యధిక పారితోషికం తీసుకునే కమెడియన్లలో సునీల్ ఒకరని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.