Sajjala Bhargava Reddy : వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. . ఆయన పిటిషన్‌ను స్వీకరించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది..
విజ్ఞప్తులు ఏమైనా ఉంటే హైకోర్టు ముందే చెప్పుకోవాలని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై నమోదైన కేసుల్లో తనపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయాలని ఇటీవల భార్గవరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం నిరాకరించింది..
సజ్జల భార్గవరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, ఏపీ ప్రభుత్వం తరఫున మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. పాత విషయాలకు కొత్త చట్టాల ప్రకారం కేసులు పెడుతున్నారని కపిల్ సిబల్ చెప్పగా.. చట్టాలు ఎప్పటివనేది కాదని.. మహిళలపై చేసిన అసభ్య వ్యాఖ్యలు చూడాలని లూథ్రా వాదించారు. ఈ వ్యవహారంలో భార్గవరెడ్డి కీలక సూత్రధారి అని.. ప్రస్తుత దర్యాప్తునకు కూడా సహకరించడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు ముందు చాలా విషయాలు గోప్యంగా ఉంచారన్నారు ఏపీ హైకోర్టును ఆశ్రయించేందుకు ధర్మాసనం రెండు వారాల సమయమిచ్చింది..