
Surjewala : కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య పేరు ఖరారైంది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుర్జేవాలా కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎంపిక విషయంలో అసత్య ప్రచారాలు ప్రబలుతున్నాయని వాటిని నమ్మవద్దని ఆయన కన్నడ ప్రజలను కోరారు. సీఎం ఎంపిక సమావేశంలో జరుగుతున్న నిర్ణయాలను ఆయన బయటపెట్టారు. దీనిపై ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును సైతం సూచించారని ఇక ప్రకటనే తరువాయి అని చెప్పారు.
సీఎంగా సిద్ధరామయ్యను నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు ఉదయం (మే 17) నుంచి వార్తలు వ్యాపించాయి. అయితే కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా తనకే సీఎం పదవి కావాలని తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. దీంతో పార్టీ నేతలు మళ్లగుల్లాలు పడుతున్నారు. డీకే సీఎంగా తానే ఉంటానని పేచీ పెడుతుండడంతో అధిష్టానానికి తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా డీకేను ఒప్పటించే ప్రయత్నం చేశారు. కానీ ఆయన ఎంతకు ఒప్పుకోవడం లేదు. సీఎం రేసులో వెనక్కి తగ్గేది లేదని డీకే రాహుల్ కు స్పష్టంగా చెప్పారు. ఈ భేటీ అనంతరం డీకే నేరుగా ఖర్గే నివాసానికి వెళ్లారు. ఆయన కూడా రాహుల్ ప్రతిపాదననే తెచ్చారు. సీఎం తర్వాత అంతే కీలకమైన డిప్యూటీ సీఎం పదవి డీకేకు ఇస్తామని శాంతింపజేసింది అధిష్టానం.
సీఎంగా సిద్ధరామయ్యను ప్రకటించడంతో ఆయన మద్దతు దారులు, వర్గీయులు సంబురాలు చేసుకున్నారు. బెంగళూర్ లోని సిద్ధరామయ్య ఇంటి వద్దకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. సిద్ధూ పోస్టర్ కు పాలాభిషేకం చేసి కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇక సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా రేపు కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. కర్ణాటక రాజకీయాల్లో బుధవారం కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కర్ణాటకకు సీఎం చేయాలని రాష్ట్రంలోని కొందరు నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎస్సీలు ఎక్కువగా ఉన్నందున వారికి ప్రతినిధిగా ఖర్గేను సీఎంచేయాలని కోరారు. కర్ణాటక పీసీసీ కార్యాలయం ఎదుట ఆందోళనకు కూడా దిగారు.