- శతక్కొట్టిన మిస్టర్ 360

Surya Kumar Yadav First IPL Century : ముంబై వాంఖడే స్టేడియం హోరెత్తింది. ఒక్కడి విధ్వంసకర ప్రతాపానికి అభిమానలోకం సంబురాల్లో మునిగి తేలింది. మిస్టర్ 360 గా పేరున్న ఓ యోధుడి ప్రతాపం ఆ మైదానమే చిన్నబోయింది. బాల్ ఎటు వెళ్తుందో తెలియక ఫీల్డర్లు ఏమి చేయలేక మిన్నుకుండు పోవాల్సిన పరిస్థితి నెలకొంది.
సూర్యుడి విధ్వంసం..
ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ ఆడుతున్న సూర్య కుమార్ యాదవ్ (Surya Kumar Yadav) ఈ సీజన్లో ఇప్పటివరకు అంతగా ఆకట్టుకోలేదు. తన శైలి చూపించలేదు. మైదానంలో 360 డిగ్రీలు బంతిని బ్యాట్ తో కొట్టే ఏకైక బ్యాట్స్ మన్ గా సూర్యకు పేరుంది. ఇప్పటివరకు ఏడు మ్యాచ్ ల్లో ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు. శుక్రవారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో తన ప్రతాపాన్ని చూపాడు. అసలు బాల్ దొరుకుతుందా అనే రీతిలో విరుచుకుపడ్డాడు. 49 బంతుల్లో తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 11 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. అఖరి బంతికి సిక్స్ కొట్టి తన స్కోర్ 103 కు చేరుకున్నాడు.
ఐపీఎల్ లో సూర్య కుమార్ కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ముంబై ఇండియన్స్ కి ఆడిన ఆటగాళ్లలో సెంచరీ చేసిన ఐదోవాడు ఈ యాదవ్. ఏదేమైనా స్టేడియం మొత్తం హోరెత్తెలా బ్యాట్ ను ఝులిపించాడు. సూర్య.. సూర్య అంటూ మైదానమంతా మార్మోగేలా చేశాడు. ఐపీఎల్ 16 వ సీజన్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో సూర్య కుమార్ తనదైన శైలిలో ఆడి, గుజరాత్ టైటాన్స్ కు భారీ లక్ష్యాన్ని ముందుంచాడు. గుజరాత్ టైటాన్స్ లో రశీద్ ఖాన్ ఒంటరి పోరాటం చేసినా , పరాజయమే వారిని పలకరించింది. ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.