
వైసీపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎమ్మెల్యేల వ్యాఖ్యలు చర్చకు దారి తీస్తున్నాయి.తాను జగన్ కోసం సర్వం పొగొట్టుకున్నానని, కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని పెద్దారెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో ఉన్న సమయం నుంచి ఇప్పటి వరకు వైఎస్ కోసం పని చేసారని గుర్తు చేశారు. జేసీ బ్రదర్స్ పై అలుపెరుగని పోరాటం చేస్తున్నానని, తనను కానీ, పార్టీ కార్యకర్తలను పార్టీ పట్టించుకోవడం లేదని అవేదనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఎవరు మన కోసం పని చేసారు, వారికి ఏం చేయాలనే ఆలోచన నేతలకు ఉండాలని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ లో ఉనప్పటి నుంచి వైఎస్ కుటుంబానికి తొలి నుంచి విధేయుడైన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 2019 జేసీ ప్రభాకర్ రెడ్డిపై గెలిచిన రికార్డు నెలకొల్పారు కేతిరెడ్డి. సుదీర్ఘ కాలంగా తాడిపత్రిలో పెద్దారెడ్డి జేసీ బ్రదర్స్ పైన పోరాటం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు..అధికారులు సహకరించకపోవటం పైన పెద్దారెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి.
అనంతపురం జిల్లాలో వైసీపీ 2019 ఎన్నికల్లో 12 స్థానాలు గెలిచింది. ఉరవకొండ, హిందూపురం మాత్రమే టీడీపీ విజయం సాధించింది. తాడిపత్రిలో వైసీపీ నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి విజయం సాధించారు. ఎమ్మెల్యే గా గెలిచిన సమయం నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సస్ పెద్దారెడ్డి అన్నట్లుగా అక్కడ రాజకీయం కొనసాగుతోంది. అనేక సార్లు అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర స్థాయిలో చర్చకు దారి తీసాయి. పలు సందర్భాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తిరిగి వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ నుంచి పెద్దారెడ్డి పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. కానీ, ఈ సమయంలోనే పెద్దారెడ్డి కార్యకర్తల విషయంలో చేసిన వ్యాఖ్యలు జిల్లాలో చర్చకు దారి తీసాయి.అనంతపురం జిల్లా యల్లనూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి అక్కడ బైఠాయించారు. దంతలపల్లిలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీని పైన మ్మెల్యే పెద్దారెడ్డి, నారాయణ రెడ్డి వర్గీయుల మధ్య వివాదం నెలకొంది. ఇరు వర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఇదే సమయంలో పార్టీ కోసం పని చేస్తున్న కార్యకర్తలను గుర్తిస్తేనే నేతలుగా గుర్తింపు దక్కుతుందని చెప్పుకొచ్చారు. ఎవరు మనకోసం పని చేశారని ఆలోచన ఉండాలని, ఆ ఆలోచన లేకపోతే ఉనికి కోల్పోతారని హెచ్చరించారు. కార్యకర్తలు మద్దతుగా ఉన్నంత వరకే ఎవరైనా నేతలుగా చెలామణి అవుతారని పేర్కొన్నారు. తొలి నుంచి జగన్ కు విధేయుడిగా పేరున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇప్పుడు చేసిన వ్యాఖ్యల పైన వైసీపీలో చర్చ మొదలైంది. దీని పైన పార్టీ ముఖ్య నేతలు ఏం జరిగిందనే అంశం పైన ఆరా తీస్తున్నట్లు సమాచారం.






