
Tamoto Farmers : బండ్లు ఓడలవుతాయి. ఓడలు బండ్లవుతాయి. ఒకోసారి మనం అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి అవుతుంది. గతంలో టమాటా ధర రూ. 200 పలికి చాలా మందికి ఆర్థిక పుష్టి కలగజేసిన కూరగాయ ఇప్పుడు పూర్తిగా నష్టాల్లో పడేసింది. దీంతో ఏం చేయాలో రైతులకు అర్థం కావడం లేదు. కనీస ధర కూడా రాకపోవడంతో ఎటు పాలుపోవడం లేదు.
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ లో ధర రూ. 3కు చేరడంతో కనీస పెట్టుబడి కూడా రావడం లేదని వాపోతున్నారు. ఒక్కో కూలీకి రూ.300 చెల్లించి మార్కెట్ కు తీసుకొస్తే మద్దతు ధర కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కిలో ధర 50 పైసలకు పడిపోవడం దారుణం. ప్రస్తుతం డిమాండ్ కు మించి టమాట రావడంతో ధరలు విపరీతంగా పడిపోయాయి.
నంద్యాల ప్యాపిలి మార్కెట్ పరిధిలో ధరల తగ్గుదల నమోదు కావడంతో మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కీమ్ కింద వ్యాపారులతో పోటీపడి రైతుల వద్ద టమాటాలు కొనుగోలు చేశారు. ప్రతిరోజు ప్రధాన మార్కెట్లలో టమాటా ధరలను రైతు బజార్లలో విక్రయిస్తున్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. టమాటకు మద్దతు ధర కల్పిస్తామంటున్నారు.
టమాట నాణ్యతను బట్టి కనిష్టంగా రూ. 8, గరిష్టంగా రూ. 16 గా పలుకుతోంది. బహిరంగ మార్కెట్లలో రూ. 11 నుంచి రూ. 24 వరకు ఉంటోంది. రైతు బజార్లలో రూ. 90 నుంచి రూ. 20 వరకు అమలు చేస్తున్నారు.ఇప్పుడు టమాట ధర ఇంత దారుణంగా పడిపోవడం విడ్డూరం. ఈ నేపథ్యంలో టమాట రైతులకు అండగా నిలుస్తామని అధికారులు చెబుతున్నారు.